Thursday, 9 April 2015

ఇదో బూటకపు ఎన్‌కౌంటర్

ఇదో బూటకపు ఎన్‌కౌంటర్

Sakshi | Updated: April 09, 2015 04:22 (IST)
ఇదో బూటకపు ఎన్‌కౌంటర్
ఎన్‌కౌంటర్‌పై సీబీఐతో
 విచారణ జరిపించాలి
 పౌరహక్కుల సంఘం
 రాష్ట్ర కార్యదర్శి క్రాంతిచైతన్య

 తిరుపతి కార్పొరేషన్: శేషాచల అటవీ ప్రాంతంలో ఎర్రచందనం కూలీలపై జరిగిన ఎన్‌కౌంటర్ ముమ్మాటికీ పోలీసుల హత్యేనని, తక్షణమే సంఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని పౌరహక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి క్రాంతి చైతన్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఎన్‌కౌంటర్‌లో 20 మంది ఎర్రచందనం కూలీలు హతమైన విషయం విదితమే. బుధవారం ఉదయం మృతదేహాలకు రుయా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహిస్తున్న సమయంలో పౌరహక్కుల సంఘం నాయకులు మార్చురీ వద్దకు చేరుకుని పోలీసులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

  ఈ సందర్భంగా క్రాంతి చైతన్య మాట్లాడుతూ శ్రీవారి మెట్టు వద్ద జరిగిన ఎన్‌కౌంటర్ బూటకం అన్నారు. మూడు రోజుల క్రితం పట్టుకున్న కూలీలను చిత్రహింసలు పెట్టారని, ఆఖరికి ఎన్‌కౌంటర్ అంటూ కట్టుకథలు అల్లుతున్నారని ఆరోపించారు. తమపై రాళ్లు రువ్వారని చెబుతున్న పోలీసుల మాటలు కట్టుకథలుగా అభివర్ణించారు.  తక్షణమే సిట్టింగ్ జడ్జీతో న్యాయ విచారణ జరిపించాలని కోరుతూ హైకోర్టులో రిట్ పిటీషన్ దాఖలు చేయనున్నట్టు తెలిపారు. జాతీయ మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తున్నామన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో పౌరహక్కుల సంఘం జిల్లా కోశాధికారి లత, హేమాద్రి, రఘు పాల్గొన్నారు.
 

No comments:

Post a Comment