Thursday, 9 April 2015

మీ వాళ్లను ఆపండి

మీ వాళ్లను ఆపండి

మార్చిలోనే తమిళ సర్కారుకు ఏపీ లేఖ
ఎర్ర దొంగలను కట్టడి చేయాలని సూచన
తమ ప్రభుత్వం సీరియస్‌గా ఉందని స్పష్టీకరణ
చర్యలు తప్పవంటూ డీఐజీ కాంతారావు లేఖ
‘నల్ల ఇదళ్‌’ పత్రిక ప్రత్యేక కథనం
శేషాచలం ఎన్‌కౌంటర్‌పై తమిళనాట చర్చ
తమ సర్కారు తప్పిదమూ ఉందనే విశ్లేషణ
హైదరాబాద్‌, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): చందనం చెట్లను నరికే వీరప్పన్‌ ముఠాను వెంటాడి వెంటాడి అంతమొందించిన తమిళనాడు ప్రభుత్వం... పక్కరాష్ట్రంలో ఎర్రచందనం చెట్లను నరికే వారిని మాత్రం చూసీ చూడకుండా వదిలేసిందా? ‘ఇకపై మేం చూస్తూ ఊరుకోం! మీ ప్రభుత్వం కూడా సహకరించాలి. ఎర్ర చందనం నరికే కూలీలు సరిహద్దులు దాటకుండా చూడాలి!’ అని ఏపీ సర్కారు లేఖ రాసినప్పటికీ తమిళనాడు ఉదాసీనత ప్రదర్శించిందా? ఒకేరోజు 20 మంది ఎర్రదొంగల ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో తమిళనాడులో ఇది చర్చనీయాంశంగా మారింది. ఇదే క్రమంలో... ఏపీ సర్కారు రాసిన లేఖను ప్రస్తావిస్తూ గత నెలలోనే ‘నల్ల ఇదల్‌’ అనే తమిళ మాస పత్రిక ప్రచురించిన కథనంపైనా తమిళనాట విస్తృతస్థాయిలో చర్చ జరిగింది. ‘ఎర్ర కూలీలను నియంత్రించాలి. లేనిపక్షంలో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది’ అని ఏపీ టాస్క్‌ఫోర్స్‌ డీఐజీ కాంతారావు గత నెల 5న తమిళనాడు అధికారులకు లేఖ రాసినట్లుగా ఈ పత్రిక తెలిపింది. ఏపీ ప్రభుత్వ హెచ్చరికల గురించి, ఆ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి ‘నల్ల ఇదళ్‌’ గత నెలలో ప్రత్యేక కథనం ప్రచురించింది. తిరువణ్నామలై - వేలూరు జిల్లాల మధ్య ఉన్న జవ్వాది కొండల్లోని గ్రామాలకు చెందిన ‘ఎర్ర కూలీల’ పూర్వాపరాలను వివరించింది. ‘‘వీరంతా గతంలో తమిళనాడు పరిధిలోనే చెట్లు నరికేవారు. నాటుసారా తయారు చేసేవారు. తమిళ పోలీసుల కఠిన చర్యల నేపథ్యంలో... డబ్బు కోసం ఎర్రచందనం చెట్లు నరికేందుకు వెళ్తున్నారు’’ అని వివరించింది. గతంలో వీరు అటవీ సిబ్బందిపై చేసిన దాడులు, హత్యల గురించి వివరించింది. చివరలో... టాస్క్‌ఫోర్స్‌ డీఐజీ కాంతారావు మార్చి 5వ తేదీనే తమిళనాడు అధికారులకు లేఖ రాసినట్లు తెలిపింది. ‘ఎర్ర చందనం కూలీలపై కఠిన చర్యలు తీసుకుంటాం. వారిని నియంత్రించండి. శేషాచలం అడవుల్లోకి రాకుండా చూడండి’ అంటూ తమిళ అధికారులను ఆయన కోరినట్లు పేర్కొంది. ఇప్పటికైనా తమిళనాడు ప్రభుత్వం మేల్కోవాల్సిన అవసరముందని, ఎర్ర కూలీల విషయంలో జాగ్రత్తపడాలని ‘నల్ల ఇదళ్‌’ సూచించింది. గతంలోనూ పలు పత్రికలు ఎర్ర కూలీల గురించి, వారిని అడ్డుకోవాల్సిన అవసరం గురించి అనేక కథనాలు ప్రచురించాయి. ‘‘స్మగ్లర్లు ఇచ్చే డబ్బులకోసం ఆశపడి ఎర్రచందనం కూలీలుగా మారుతున్నారు. కేసుల్లో ఇరుక్కుంటున్నారు. ఇప్పటికే 1500 మంది దాకా తమిళ కూలీలు ఆంధ్రా జైళ్లలో మగ్గుతున్నారు. ఇకనైనా తమిళనాడు ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకోవాలి’’ అని తెలిపాయి. ఎర్రచందనం స్మగ్లర్‌ వీరప్పన్‌ను ఎన్‌కౌంటర్‌ అన్నా డీఎంకే హయాంలోనే జరిగింది. ‘‘ఇప్పుడూ అదేపార్టీ అధికారంలో ఉంది. కానీ... శేషాచలం అడవుల్లో ఎర్రచందన వృక్షాలను నరికేందుకు తరలివెళ్లే ఎర్రకూలీలను మాత్రం చూసీచూడనట్లుగా వ్యవహరిస్తోంది’’ అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఎవరి పాపం ఎంత?
‘ఎన్‌కౌంటర్‌లో 20 మంది మరణించడం వెనుక ఏపీతోపాటు తమిళనాడు సర్కారు పాపమూ ఉంది’ అనే కోణంలో తమిళ నాట చర్చ జరుగుతోంది. ఈ అంశంపై మంగళవారం, బుధవారం తమిళ న్యూస్‌ చానళ్లలో చర్చలు జరిగాయి. ‘‘విభజన తర్వాత ఏపీ ప్రభుత్వం ఆర్థిక లోటుతో అల్లాడుతోంది. ఎర్రచందనంపై వచ్చే ఆదాయం కోసం తహతహలాడుతోంది. ఇందులో భాగంగా స్మగ్లర్లను అరికట్టేందుకు పలు కఠిన నిర్ణయాలు తీసుకున్నట్లు తమిళనాడు ప్రభుత్వానికి తెలిసినా పెద్దగా పట్టించుకోలేదు’’ అని పలువురు విమర్శించారు. అయితే... తమిళనాడుకు చెందిన అత్యధిక పత్రికలు అమాయక కూలీలను ఏపీ ప్రభుత్వం పొట్టనబెట్టుకుందని విమర్శించాయి.

No comments:

Post a Comment