|
ఎన్‌కౌంటర్ మృతుల్లో ఇద్దరు పాత నేరగాళ్లు
మిగతా 18 మంది నేరచరిత్రపై ఆరా
3 తమిళ జిల్లాలకు ప్రత్యేక పోలీస్ బృందాలు
శేషాచలంలో తమిళ స్మగ్లర్ల సామ్రాజ్యం
నాలుగేళ్లలో 10 వేల మంది స్మగ్లర్లు అరెస్ట్
కట్టర్ నుంచి స్మగ్లర్ వరకు అంతా వాళ్లే
ముందే హెచ్చరించిన టాస్క్‌ఫోర్స్ డీఐజీ
కీలక స్మగ్లర్ల ఫొటోలు.. చిరునామాలతో సహా.. ఆయా జిల్లాల కలెక్టర్లు, డీఐజీలకు లేఖలు
ఎర్ర స్మగ్లర్లను నిరోధించాలని వినతి
అయినా ఆగని ఎర్రదొంగల బరితెగింపు
‘శేషాచలం ఎన్‌కౌంటర్‌లో మృతి చెందింది ఆషామాషీ కూలీలు కాదు. ఈ ఎర్ర కూలీలది కరుడుగట్టిన నేరచరిత్ర. చావడానికైనా.. చంపడానికైనా తెగించిన ముష్కరుల ముఠా అది’ ఈ విషయాన్ని చెప్పింది ఏపీ పోలీసులు కాదు.. సాక్షాత్తు తమిళనాడుకు చెందిన పోలీసులు చెప్పిన మాటలివి. తమిళ పోలీసుల వాదనకు బలం చేకూర్చేలా శేషాచలం ఎన్‌కౌంటర్ మృతుల్లో ఇద్దరిని పాత నేరగాళ్లుగా గుర్తించారు. ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన తిరువణ్ణామలై జిల్లాకు చెందిన మేళకుప్సనూరుకి చెందిన రాజేంద్రన్ (27) అలియాస్ కన్నన్ కరడుగట్టిన స్మగ్లర్.. రాజేంద్రన్‌తోపాటు కుమార్ అనే మరో మృతుడిపైనా పలు కేసులు ఉన్నాయి. ఎన్‌కౌంటర్ మృతుల్లో మిగిలిన 18 మందిదీ నేరచరిత్రేనన్నది పోలీసుల మాట.
హైదరాబాద్/తిరుపతి, ఏప్రిల్ 9(ఆంధ్రజ్యోతి) : ‘శేషాచలం ఎన్‌కౌంటర్‌లో మృతి చెందింది ఆషామాషీ కూలీలు కాదు. ఈ ఎర్ర కూలీలది కరుడుగట్టిన నేరచరిత్ర. చావడానికైనా.. చంపడానికైనా తెగించిన ముష్కరుల ముఠా అది’ ఈ విషయాన్ని చెప్పింది ఏపీ పోలీసులు కాదు.. సాక్షాత్తు తమిళనాడుకు చెందిన పోలీసులు చెప్పిన మాటలివి. తమిళ పోలీసుల వాదనకు బలం చేకూర్చేలా శేషాచలం ఎన్‌కౌంటర్ మృతుల్లో ఇద్దరిని పాత నేరగాళ్లుగా గుర్తించారు. ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన తిరువణ్ణామలై జిల్లాకు చెందిన మేళకుప్సనూరుకి చెందిన రాజేంద్రన్ (27) అలియాస్ కన్నన్ 2013 మేలో ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేస్తూ రేణిగుంట అర్బన్ పోలీసులకు పట్టుబడ్డాడు. అతనిపై 74/2013 అండర్ సెక్షన్ 379, సెక్షన్ 20/1, సెక్షన్ 29/2తోపాటు ఏపీ ఫారెస్ట్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి, అరెస్ట్ చేసినట్లు తిరుపతి అర్బన్ ఎస్పీ గోపీనాథ్ తెలిపారు. అయితే, కొద్ది రోజులకే రాజేంద్రన్ బెయిల్‌పై బయటికి వచ్చాడు. తిరిగి ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ ఇంతకాలం పోలీసుల కళ్లుగప్పి చివరకు ఎన్‌కౌంటర్‌లో మృతిచెందాడు. రాజేంద్రన్‌తోపాటు కుమార్ అనే మరో మృతుడిపైనా పలు కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఎన్‌కౌంటర్ మృతుల్లో మిగిలిన 18 మందిదీ ఇదే తరహా నేరచరిత్ర అని పోలీసులు పేర్కొంటున్నారు. వీరి నేరచరిత్రను తెలుసుకునేందుకు తమిళనాడులోని ధర్మపురి, సేలం, తిరువణ్ణామలై జిల్లాలకు ప్రత్యేక పోలీసు బృందాలను పంపామని రాయలసీమ ఐజీ వేణుగోపాలకృష్ణ తెలిపారు. తమిళనాడుకు వెళ్లిన ఏపీ పోలీసులకు తమిళ పోలీసులు ఎర్రకూలీల కరుడుగట్టిన నేరప్రవృత్తిని వివరిస్తున్నారు. ఇదే విషయాన్ని తాము రెండేళ్ల క్రితమే హెచ్చరించామనీ చెబుతున్నారు.
ఎర్ర చెట్లపై ఆశ వదిలేసుకోండి..
2013 జనవరి ఫిబ్రవరిల్లో.. ఏపీ అటవీశాఖ అధికారులు, టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న కొంత మంది తమిళులను పట్టుకున్నారు. విచారణలో వీళ్లందరిదీ తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా అని తెలిసింది. వీళ్లని గుర్తుపట్టడానికి తిరువణ్ణామలై జిల్లా పోలీసు అధికారులు కొందరిని తిరుపతికి పిలిపించారు. ఎర్ర దొంగలను వాళ్ల ముందుకు తీసుకువచ్చారు. ఎర్రదొంగల్లో చాలా మందిని తమిళ పోలీసులు గుర్తుపట్టి పేర్లు పెట్టి పిలిచి మరీ పలకరించారు. ఆ తర్వాత తిరుపతి అటవీ అధికారులతో తిరువణ్ణామలై పోలీసులు ఇలా చెప్పారు..‘వీళ్ల తాతలు, తండ్రులు కూడా చెట్లు నరికే బతికేవాళ్లు. వీరప్పన్ ముఠాలో తిరిగేవాళ్లు. వీళ్లకి తెలిసిన ఒకే ఒక్క పని చెట్టు నరకడం మాత్రమే. అడవిలో వీళ్లని పట్టుకోవడం ఎవరికీ సాధ్యంకాదు. ఒక్కొక్కరు 70 నుంచి 100 కిలోల బరువున్న దుంగలు మోస్తూ 20 కిలోమీటర్లు అవలీలగా నడుస్తారు. నడక కూడా పరుగెత్తినట్లే ఉంటుంది. వీళ్ల కన్ను శేషాచలం మీద పడింది. ఇక మీరు ఎర్రచందనం చెట్ల గురించి మరచిపోవాల్సిందే. వీళ్లని ఎవరూ అపలేరు. వీళ్లకి చట్టాలంటే ఏమిటో తెలియదు. పోలీసులంటే భయంలేదు. చంపడానికైనా, చావడానికైనా వెనుకాడరు’ తమిళనాడు పోలీసు అధికారుల మాటలు పొల్లుపోలేదు. పై ఘటన జరిగి రెండేళ్లు దాటింది.. ఈ రెండేళ్ల కాలంలో ఎందరిని అరెస్టు చేసినా.. ఎన్ని కేసులు పెట్టినా.. ఎందరిని జైళ్లపాలు చేసినా.. అడపాదడపా సంఘటనల్లో ఐదుగురు కూలీలు కాల్పుల్లో చనిపోయినా.. శేషాచలం అడవుల్లోకి తమిళనాడు నుంచి ఎర్ర స్మగ్లర్ల దండును మాత్రం నిరోధించలేకపోయారు. వేలాది టన్నుల ఎర్రచందనం తరలిపోతూనే ఉంది. ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసినా.. సాయుధ బలగాలు శేషాచలం అడవులును జల్లెడపడుతన్నా తమిళనాడుకు చెందిన ఎర్ర స్మగ్లర్ల కదలికలు మాత్రం తగ్గలేదు. పైగా తమకు ఎదురువచ్చే అటవీ అధికారులను అత్యంత క్రూరంగా చంపడానికీ వారు వెనుకాడని పరిస్థితి. తాజా ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన రాజేంద్రన్‌ది తిరువణ్ణామలై జిల్లానే.
అడుగడుగునా బరితెగింపే..
ఎర్రచందనం స్మగ్లింగ్ అంటే ఒక్కరు చేసే పని కాదు. అడవిలో ఆ చెట్లు ఎక్కడున్నాయో దారి చూపడం మొదలు వాటిని నరికి విదేశాలకు ఎగుమతి చేసే వరకు వివిధ దశలున్నాయి. ఒక్కో దశ పనులను నిర్వహించడానికి ఒక్కో వర్గం ఉంటుంది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాకపూర్వం కేవలం కట్టర్లు మాత్రమే తమిళనాడు నుంచి వచ్చేవారు. మిగిలిన వారంతా స్థానికంగానే ఉండేవారు. అందుకే ప్రభుత్వం తొలుత స్థానికంగా ఉన్నవారిపై దృష్టి సారించింది. వీరిని అరెస్టు చేసి అదుపుచేస్తే ఈ ప్రాంతంతో..ముఖ్యంగా శేషాచలం అటవీ ప్రాంతంతో ఏ మాత్రం సంబంధం లేని తమిళ కట్టర్లు (చెట్లు నరికేవారు) ఇక్కడికి రారని భావించింది. ఆ క్రమంలోనే ఇక్కడున్న బడా స్మగ్లర్ల ఏరివేత మొదలు పెట్టింది. కానీ వారి అంచనాలు తల్లకిందులయ్యాయి. కొద్ది నెలల కాలంలోనే తమిళనాడులోని వేలూరు, ధర్మపురి విల్లుపురం,సేలం, తిరువణ్ణామలై జిల్లాల నుంచి వేలాది మంది శేషాచలం అడవుల్లోకి ప్రవేశించారు. గతంలో కూలీలుగా ఉన్నవారు చిన్నసైజు స్మగ్లర్లుగా మారిపోయారు. శేషాచలంలో ఎర్రచందనం స్మగ్లింగ్ అంతా ఇప్పుడు తమిళనాడుకు చెందిన వారి చేతిలోకి వెళ్లిపోయింది. అడవిలో ఎర్రచందనం దుంగలు ఎత్తుకొని పది మంది స్మగ్లర్లు కనిపించారంటే ఆ ప్రాంతంలో ఉన్నది ఆ పది మందే అనుకుంటే పొరబాటే. కూతవేటు దూరంలో వందల సంఖ్యలో స్మగ్లర్లు ఉంటారు. ఈ బ్యాచ్‌ల్లో ఏ ఒక్కరు ప్రమాదంలో పడినా మిగిలిన వారికి వింత శబ్దాలతో సంకేతాలు అందజేస్తారు. అవి చెవినపడిన వెంటనే ఆ చుట్టుపక్కల ఉన్న స్మగ్లర్లంతా ఆ చోటును చుట్టుముడతారు. సంఘటనా స్థలానికి 20, 30 మీటర్ల దూరం నుంచి క్రికెట్ బాలు సైజున్న రాళ్లతో దాడి చేస్తారు. తేనెటీగలు చుట్టిముట్టినట్లే ఉంటుంది వీరి దాడి. ప్రత్యర్థులను చంపడమే లక్ష్యంగా వీరి దాడి సాగుతుంది
ఐదు జిల్లాలు..73 మంది కీలక స్మగ్లర్లు
టాస్క్‌ఫోర్సు అధికారుల క్రైం రికార్డుల ప్రకారం తమిళనాడుకు చెందిన వేలూరు, ధర్మపురం, విల్లుపురం, సేలం, తిరువణ్ణామలై జిల్లాల పరిధిలో 73 మంది కీలక స్మగ్లర్లను గుర్తించి వారి పేర్లు, చిరునామాలు సేకరించారు. చెన్నై రెడ్‌హిల్స్‌కు చెందిన షాముగం అలియాస్ బాల్‌రాజు ప్రధాన స్మగ్లర్. ఇతను సరుకును షిప్పుల ద్వారా నేరుగా దుబాయ్‌కి సరఫరా చేస్తాడు. దుబాయ్ నుంచి ఎర్రచందనం స్మగ్లింగ్ కార్యక్రమాలను నిర్వహించే షాహుల్ హమీద్‌తో ప్రత్యక్ష సంబంధాలున్నాయి. చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల పరిధిలోని స్మగ్లర్లను ఫోన్‌లో దుబాయ్‌లోని షాహుల్ హమీద్‌తో కలిపి వ్యాపార లావాదేవీలు కుదురుస్తుంటాడు.
25 రోజులకు ముందే హెచ్చరించారు..
శేషాచలం అడవిలో తమిళ స్మగ్లర్లు చేస్తున్న విధ్వసం.. అటవీ, పోలీసు అధికారులపై చేస్తున్న దాడులకు సంబంధించిన వివరాలతోపాటు 2014వ సంవత్సరాంతానికి తమ పోలీసు రికార్డుల్లోకి ఎక్కిన తమిళనాడుకు చెందిన ప్రధాన స్మగ్లర్ల జాబితా, వారి ఫొటోలు, చిరునామాలు, వారి నేరప్రవృత్తిని వివరిస్తూ టాస్క్‌ఫోర్స్ డీఐజీ కాంతారావు వేలూరు, ధర్మపురి, విల్లుపురం, సేలం, తిరువణ్ణామలై జిల్లాల కలెక్టర్లకు, డీఐజీలకు లేఖ రాశారు. గత నాలుగేళ్ల కాలంలో పై జిల్లాలకు చెందిన పదివేల మందిపై స్మగ్లింగ్ కేసులు నమోదు చేశామని, అయినా మీ ప్రాంతాల నుంచి స్మగ్లర్ల రాక ఆగడం లేదని, వారిని నిలువరించాలని ఆ లేఖలో కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎర్రచందనం, అటవీ సంపదను పరిరక్షించడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుందని, అందుకోసం ప్రత్యేకంగా సాయుధ బలగాలతో టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసిందని తెలిపారు. మార్చి 16న ఈ లేఖను కాంతారావు ఆయా జిల్లాల అధికారులకు పంపారు. అయినా శేషాచలం అడవిపైకి తమిళ స్మగ్లర్ల దండ యాత్ర ఆగలేదు. ఎర్ర దొంగల బరితెగింపునకు అదే నిదర్శనం. ఈ లక్షణమే మంగళవారం భారీ ఎన్‌కౌంటర్‌కి దారితీసింది.
కిటకిటలాడుతున్న రాయలసీమ జైళ్లు
తమిళనాడులోని వేలూరు, ధర్మపురి విల్లుపురం,సేలం, తిరువణ్ణామలై జిల్లాల నుంచే ప్రధానంగా ఎర్రదొంగలు శేషాచలంలోకి పోటెత్తుతున్నారు. నాలుగేళ్లలో పట్టుబడిన తమిళనాడుకు చెందిన ఎర్రదొంగల సంఖ్య ఎంతో తెలుసా? పదివేలు. వీరంతా ఈ ఐదు జిల్లాలవారే. శేషాచలం స్మగ్లింగ్ సామ్రాజ్యం మొత్తం ఐదు తమిళజిల్లాల చేతిలోనే ఉంది. ఇందులోనూ మాలవైమక్కళ్ అనే గిరిజన తెగవాళ్లదే కీలకపాత్ర. పోలీసులు అరెస్ట్ చేసిన వారితో రాయలసీమ, నెల్లూరు జిల్లాల జైళ్లు కిటకిటలాడిపోతున్నాయి. ఎర్రచందనందొంగల విచారణ కూడా ఓ సమస్యగా మారింది. సాధారణంగా నేరస్థులనుకోర్టుకు తీసుకెళ్లి జడ్జి ముందు హాజరుపరుస్తారు. అయితే, ఇటీవల తిరుపతిలో ఎర్ర దొంగల విచారణ సందర్భంగా వారిని కోర్టుకు తీసుకురావడం అసాధ్యమైపోయింది. వందల సంఖ్యలో ఉన్న దొంగలను కోర్టులో హాజరుపర్చడం దుర్లభం కావడంతో వారందరినీ ఆడిటోరియంలో సమావేశపరిచి జడ్జినే అక్కడకు తీసుకెళ్లారు. వీరిని జైళ్ల నుంచి కోర్టుకు తరలించడానికి ఒక్కో ట్రిప్పులో లక్షల రూపాయలు ఖర్చవుతున్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకొని తమిళనాడు నుంచి భారీగా వచ్చిపడుతున్న ఎర్రచందనం స్మగ్లర్లు, దొంగల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని, నిఘాపెట్టాలని ఏపీ పోలీసులు తమిళనాడు అధికారులకు లేఖలు రాశారు.
|
No comments:
Post a Comment