Friday, 10 April 2015

ఎన్‌కౌంటర్లలో తెలుగు రాషా్ట్రల పోటీ - ప్రొఫెసర్‌ జి. హరగోపాల్‌

ఎన్‌కౌంటర్లలో తెలుగు రాషా్ట్రల పోటీ - ప్రొఫెసర్‌ జి. హరగోపాల్‌


తెలంగాణ యువత తమ త్యాగాల ద్వారా ఒక సుసంపన్నమైన ప్రజాస్వామ్య వారసత్వాన్నిచ్చారు. కనీస మానవ విలువలని, ప్రజాస్వామ్య ప్రమాణాలను కాపాడండని అడగడం తెలంగాణ ప్రజల హక్కు, అది పాలకుల బాధ్యత. చరిత్ర పరిణామం అంటే మానవ సంబంధాలు మానవీయ విలువల ఉన్నతీకరణే. కనీసం జీవించే హక్కును కాపాడాలి. మానవ చరిత్రంతా గౌరవంగా జీవించడం కొరకు మనిషి చేస్తున్న పోరాటాలే. తెలంగాణ ఉద్యమాన్ని, రాష్ట్ర అవతరణను ఆ నేపథ్యం నుంచే చూడాలి. తెలంగాణలో పౌరహక్కులు పూర్తి
ప్రమాదంలో పడకూడదు.
ఒక ఆంగ్ల దిన పత్రిక ఏప్రిల్‌ 9 నాటి తన ఎడిటోరియల్‌లో రెండు తెలుగు రాషా్ట్రల్లో జరిగిన ఎన్‌కౌంటర్లపై మంచి విశ్లేషణ చేసింది. ఆంధ్ర రాష్ట్రంలో శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌ పూర్వాపరాల గురించి ప్రస్తావిస్తూ, సీనియర్‌ పోలీస్‌ అధికారి కాంతారావు, ఎర్ర చందనపు స్మగ్లర్లను అదుపు చేయడానికి కాల్చి చంపే అధికారం పోలీసులకు కావాలని ప్రభుత్వాన్ని కోరారని, దాని తర్వాతే తమిళనాడు నుంచి పొట్టకూటి కొరకు పనిచేసుకుంటున్న (వాళ్ళు స్వయాన స్మగ్లర్లు కాదు) ఇరవైమంది కూలీలను పొట్టన పెట్టుకున్నారు. పైన పేర్కొన్న రాష్ట్ర పోలీసుల కథనం ప్రకారం ఎర్రచందనపు చెట్లను నరుకుతున్న కూలీల (స్మగ్లర్ల) వైపు ముందుకు పోతున్న పోలీసులపై రాళ్లు రువ్వారని, ఆత్మరక్షణ కొరకు కాల్పులు జరపవలసి వచ్చిందని వివరణ. ఎడిటోరియల్‌ ఈ వివరణను ప్రశ్నిస్తూ, రాళ్ళు విసిరితే పోలీసుల కెవ్వరికీ కనీసం దెబ్బలు తగిలిన ఆనవాళ్ళు కూడా లేకపోవటమేమిటి? అనే సందేహాన్ని వ్యక్త పరిచింది. అంతే కాక టాస్క్‌ ఫోర్సు రెండు బృందాలుగా విడిపోయినా, ఒకే రకమైన కాల్పులు జరపడం భారీ సంఖ్యలో కూలీలు చనిపోవడం నమ్మశక్యంగా లేదని వ్యాఖ్యానించింది. ఈ ఎడిటోరియల్‌ నిస్సందేహంగా ఆ రాష్ట్ర రాజకీయ నాయకత్వాన్ని తప్పుపట్టింది. చనిపోయినవారు తమిళులు కాబట్టి తమిళనాడులో నిరసనలు చేపట్టారు. (మనం మనుషులుగా స్పందించడం మానేసాం). జాతీయ మానవ హక్కుల సంఘం, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు స్పందించి ప్రభుత్వాన్ని వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించడం ఆహ్వానించదగ్గ పరిణామం. ఈ మొత్తం సంఘటనకు అంధ్ర రాష్ట్ర రాజకీయ నాయకత్వం కానీ, లేదా పోలీస్‌ యంత్రాంగంకానీ కలవరం చెందినట్లుగా కూడా కనిపించడం లేదు. మూడు నాల్గు దశాబ్దాలుగా ఇలాంటి సంఘటనలు ఉమ్మడి రాష్ట్రంలో ఎన్ని జరగలేదు, ఎవ్వరికి శిక్షపడిందని ఇప్పుడు కలవరం చెందాలి అనే ధీమా. బహుశా ఈ పోలీసు అధికారులకు రివార్డు కూడా ప్రకటించవచ్చు.
ఆ పత్రిక కొత్త రాష్ట్రమైన, మరీ పోరాడి సాధించుకున్న తెలంగాణ రాషా్ట్రన్ని కూడా దయదలచి వదలిపెట్టలేదు.. తెలంగాణ రాషా్ట్రనికి పదినెలలు వయసే, ఆ విధంగా జువెనెయల్‌ వయసే. కానీ ఇలాంటి సంఘటనలు తెలంగాణలో జరిగినన్ని దేశంలో ఎక్కడా జరిగి ఉండవు. పది నెలల్లోగా పాత తెలంగాణలో ఉన్నట్లుగానే ఉంది. నల్గొండ ఘటనలో చనిపోయిన పోలీసులకు వాళ్ళ కుటుంబాలకు సంతాపం తప్పక తెలుపవలసిందే. ముఖ్యంగా సిద్దయ్య మరణం, ఆయన కుటుంబ గాథ చాలా కలవరపెట్టే అంశమే. ప్రాణ నష్టం ఏ రూపంలో జరిగినా బాధే కలుగుతుంది. కానీ వరంగల్‌ జైలు నుంచి చేతులకు బేడీలు వేసి తీసుకువస్తున్న బందీలు తిరగబడ్డారని, తుపాకిని లాక్కున్నారని, విధిలేక ఆత్మ రక్షణ కొరకు కాల్పులు జరిపితే అయిదుగురు బందీలు చనిపోయారన్న కథనం- విన్న వాళ్లను దిగ్ర్భాంతికి గురి చేస్తుందని ఎడిటోరియల్‌ పేర్కొంది. ఈ హత్య నల్గొండలో జరిగిన సంఘటనకు ప్రతీకార చర్య అని చాలామంది నమ్ముతున్నారు. తెలంగాణలో ప్రతీకార చర్య అనే సూత్రాన్ని 1985లో పోలీసులు కనుక్కొని ప్రవేశ పెట్టారు. దేశంలోని న్యాయ శాసా్త్రనికి దానికి ఏం సంబంధం లేదు. ఇది అటవిక దశల్లో ఆదిమ సమాజపు ప్రక్రియ. దీనిని 1985లో అప్పటి పీపుల్స్‌వార్‌ పార్టీ పోలీసు సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ యాదగిరి రెడ్డిని చంపినపుడు ప్రతీకార చర్య పేర పిల్లల డాక్టర్‌ రామనాథంను హత్య చేయడం ద్వారా అమలు చేశారు. రామనాథం పాపమల్లా ఏ డబ్బులూ ఆశించకుండా పిల్లలకు, పోలీస్‌ కానిస్టేబుళ్ల పిల్లలు సహా వైద్య సహాయం చేయడమేకాక పేద ప్రజల పౌర హక్కుల కొరకు పనిచేయడమే నేరమై పోయింది. చర్య ప్రతిచర్య లేదా ప్రతీకార చర్య ఇలా ప్రారంభమయ్యాయని తెలంగాణ ప్రజలకు మరీ ముఖ్యంగా తెలంగాణలో ప్రజా పోరాటాల ద్వారా అధికారంలోకి వచ్చిన రాజకీయ నాయకులకు ఇంత తొందరగానే గుర్తు చేయవలసిన అగత్యం ఏర్పడడం పెద్ద విషాదం. మొన్న జరిగిన నల్గొండ ప్రతీకార చర్యకు ఇంత పెద్ద చరిత్ర ఉంది.
తెలంగాణలో పౌర హక్కుల ఉల్లంఘన రాష్త్ర ఆవిర్భావం అయిన రెండు మూడు నెలల్లోనే ప్రారంభమయ్యింది. రాజకీయ పరిహాసం చేశారని టీవీ 9పైన, ఏ స్పష్టమైన నిర్దిష్టమైన ఆరోపణలు లేకుండానే ఏబీఎన్‌ చానెల్‌పైన ఆంక్షలు విధించారు. ఎంతమంది ఎన్నిరకాల సలహాలు ఇచ్చినా ఆ చర్యను వెనక్కి తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. ఇక రాజకీయ ప్రత్యామ్నాయ వేదిక తలపెట్టిన సభకు అనుమతి నిరాకరించడమేకాక, పెద్ద ఎత్తున పౌర హక్కుల కార్యకర్తలని, ప్రజాస్వామ్యవాదులని అదుపులోకి తీసుకున్నారు. దాంతో ఉమ్మడి రాష్ట్ర అణచివేత సంస్కృతి తాను ‘నిండు ప్రాణంతో ఉన్నానని’ హెచ్చరించినట్లుంది. దాని తర్వాత తెలంగాణ విద్యార్థి వేదిక నాల్గవ రాష్ట్ర మహాసభకు వచ్చినవారిని భయభ్రాంతులకు గురిచేసి, హాలు యజమానిని బెదిరించి, విద్యార్థులు వేసుకున్న టెంట్‌ను కూలగొట్టి, వచ్చిన ప్రతి విద్యార్థి ఫోటోలు తీసుకొని, వాళ్ళ తల్లిదండ్రులను, బంధువులను బెదిరించారు. యాదృచ్ఛికమే అయినా ఇదీ, మొన్నటి ఎన్‌కౌంటర్‌ కూడా నల్గొండ జిల్లాలోనే జరిగింది. దాని తర్వాత లాకప్‌ మరణాలు తెలంగాణలో తిరిగి మొదలయ్యాయని ఆ ఆంగ్ల పత్రిక ఫ్రంట్‌ పేజీలో ప్రముఖంగా ప్రచురించింది. ఇవ్వన్నీ చూసి ఇక ఎన్‌కౌంటర్లు ఒక్కటే మొదలుకాలేదని ఊపిరి పీల్చుకునే లోపల ఎన్‌కౌంటర్లు కూడా రానే వచ్చేశాయి. ఇక ఇవి ఎంత ప్రాణ నష్టం జరిగాక ఆగుతాయో తెలియదు.
తెలంగాణ రాష్ట్రం రాజకీయ నాయకత్వానికి ఎవ్వరైనా సలహాలు ఇచ్చే దశ దాటిపోయిందేమోనని అనిపిస్తుంది. నిజానికి నేను తెలంగాణ ముఖ్యమంత్రిని రెండు పర్యాయాలు కలవడం జరిగింది; ఒకటి, రాజకీయ ఖైదీల విడుదల గురించి; రెండు, ఒక సామాజిక అధ్యయన సంస్థకు రావలసిన గ్రాంట్స్‌ గురించి. అప్పుడు కలిసినప్పుడు ఐదు నిమిషాలు అని అనుకున్న ప్రతిసారి దాదాపు రెండు గంటలు మా సంభాషణ కొనసాగింది. అంత సమయం ఉంటుందని ముందే తెలిస్తే చర్చించవలసిన అంశాలు చాలానే ఉండేవి. కానీ ఆ మీటింగ్‌లలో తెలంగాణ ప్రజలకు, రాషా్ట్రనికి ప్రధానం కాని విషయాల మీద చర్చ జరిగింది.
ఇంత తొందరగా రాష్ట్రంలో పౌర హక్కుల ఉల్లంఘన జరుగుతుందని ఊహించలేకపోయాం. ఒక మూడు నాలుగు దశాబ్దాలుగా ముఖ్యంగా ఈసారి ఒక దశాబ్ద కాలం ఆగకుండా జరిగిన ఉద్యమ ఫలితంగా వచ్చిన రాష్ట్రం కాబట్టి పౌర హక్కుల స్ఫూర్తి అంత తొందరగా విధ్వంసం అవుతుందని ఎవ్వరూ భావించలేదు. ఐతే పాలన కొనసాగిన కొద్దీ పోలీసులు బలపడతారని, మౌలిక సమస్యలు పరిష్కారం కాక పోతే వాళ్ళ మీద ఆధారపడడం పెరుగుతుందని, తెలుసుకానీ అంతవరకు ఉమ్మడి రాష్ట్ర అణచివేత సంస్కృతి తిరిగి రాదని కొంత బలంగానే నమ్మినవాళ్ళల్లో నేనొకడిని. అంతేకాక ఉద్యమం నుంచి ఎదిగిన కొందరు మంత్రులుగా ఉన్నారు. కాబట్టి, రాజకీయ నాయకత్వానికి ప్రజాస్వామ్య విలువల పట్ల, చట్టబద్ధ పాలన పట్ల కొంత గౌరవం ఉంటుందని విశ్వసించే ముఖ్యమంత్రి దగ్గర ఆ ప్రస్తావన రాలేదు. ఐనా చొరవ తీసుకొని ‘అధికారం మనిషిని అమానుషంగా తయారు చేస్తుందని, కానీ మనిషి అధికారాన్ని మానవీకరించవచ్చని’ శంకరన్‌ గారిని ఉదహరిస్తూ మాట్లాడడం జరిగింది. అడగకుండా ఇచ్చే సలహాలకు అంత విలువ ఉండదనేది వేరే విషయం.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర డిమాండ్‌కి ఉద్యమ ఆరంభకాలంలోనే పౌర హక్కుల సంఘం తన పూర్తి మద్దతును ప్రకటించింది. సంఘం ఆ నిర్ణయం తీసుకున్నపుడు ఆంధ్రా ప్రాంత కార్యకర్తలంతా ఇదొక ప్రజాస్వామ్య డిమాండ్‌ అని బలపరిచారు. పౌర హక్కుల సంఘ చైతన్యానికి ఇదొక నిదర్శనం. మద్దతివ్వమే కాక ఆంధ్ర ప్రాంతంలో మద్దతును కూడగట్టడానికి బాలగోపాల్‌తో సహా ఇతర కార్యకర్తలు కృషి చేశారు. జయశంకర్‌ ఉపన్యాసాలను నిర్వహించారు పౌరహక్కుల సంఘం తన సాంప్రదాయాలను పక్కన పెట్టి ఉద్యమ నాయకుడి హోదాలో చంద్రశేఖర్‌ రావును ఒక సదస్సుకు ఆహ్వానించింది. ఆ సదస్సులో తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తాను పౌరహక్కుల ఉద్యమ అగ్రభాగాన ఉంటానని ప్రకటించారు. ఉద్యమంలో భాగం కావడం కాదుకానీ, ఇప్పుడు ఆయన పౌరహక్కులను గౌరవించి చట్టబద్ధ పాలనను అమలు చేయగలిగిన కీలక స్థానంలో ఉన్నారు. పౌర హక్కులను గౌరవించడమంటే ముందుగా ఎంత పెద్ద ఎత్తు విమర్శనైనా సహృదయంతో వినే సంస్కారం కావాలి. క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతుందో తమ పార్టీ కార్యకర్తల ద్వారా తెలుసుకోవాలి. తన సహచర మంత్రులు నిర్భయంగా మాట్లాడే వాతావరణం కల్పించాలి. కేవలం పోలీసుల సలహాల మీద, సమాచారం మీద ఆధారపడ్డ రాజకీయ నాయకులు- ఇందిరా గాంధీ నుంచి చంద్రబాబు నాయుడు దాకా ఎవ్వరూ బాగుపడలేదు. ఇలా రాసినందుకు వాళ్ళ పత్రికల్లో ‘స్వేచ్ఛారావం’ కాలమ్‌ను ఆపేశారు. ఇంత అసహనం పౌరహక్కుల సంస్కృతికి దోహదపడదు.
ఇప్పుడు జరగవలసింది నల్గొండ సంఘటనపై నిష్పక్షపాత విచారణ జరగాలి. న్యాయవిచారణకు ఆదేశించడం మంచిది. చట్టాన్ని అతిక్రమిస్తే శిక్షపడుతుందనే భయం పోలీసు యంత్రాగానికి ఉండాలి. రాజకీయ వ్యవస్థ, సివిల్‌ అధికారుల నియంత్రణలో పోలీసులు పని చేయాలి. పోలీసులు ప్రజల పట్ల బాధ్యతగా, పౌరుడిని గౌరవించేలా పోలీసు సంస్కృతిని మార్చాలి. ఒక పేదవాడు పది జిల్లాలలో పోలీసుస్టేషన్‌ ముందు నిర్భయంగా నడవగలగాలి. పోలీసులు కరీంనగర్‌ దొరల్లా ప్రవర్తించడం మానుకోవాలి. ఇది ఆశించే పౌరహక్కుల సంఘం తెలంగాణకు మద్ధతు నిచ్చింది. ఆంధ్ర నాయకుల ఆధిపత్యం పోతే ఆధిపత్య పొర ఒకటి తొలగి స్వేచ్ఛ వికాసం చెందుతుందని బాగా విశ్వసించిన వాళ్ళల్లో నేనొకడిని.
తెలంగాణలో మరొక ప్రమాదం పొంచి ఉన్నది. పోలీసు యంత్రాంగంలోని కొందరు సీనియర్‌ అధికారులకు అసాంఘిక శక్తులతో దగ్గరి సంబంధాలున్నాయి. ఇది నల్గొండ జిల్లాలో చాలా లోతుగా ఉంది. రామనాథం గారిని ప్రతీకార చర్యగా హత్య చేస్తే, దేశ వ్యాప్తంగా విమర్శలు రావడంతో పురుషోత్తంను తమ చేతికి మట్టి అంటకుండా చంపించారు. ఒక దశలో ఈ శక్తులు ప్రజాస్వామ్య భావాలున్న ప్రతి వ్యక్తిని బెదిరించారు. చంపుతామని పబ్లిక్‌గా హెచ్చరికలు చేశారు. ఇంట్లో ఫోన్‌ మోగితే కుటుంబ సభ్యలు భయపడే పరిస్థితిని సృష్టించారు. ఈ పరిస్థితి మీద అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్‌ రెడ్డితో పౌర హక్కుల సంఘం సుదీర్ఘ చర్చ జరిపిన తర్వాత ఆయన ఏం చర్యలు తీసుకున్నారో గాని మొత్తంగా పరిస్థితి అదుపులోకి వచ్చింది. అట్లని రాజశేఖర్‌రెడ్డి పాలనలో దుర్మార్గాలు జరగలేదని కాదు. ఇలాంటి అమానవీయ అప్రజాస్వామిక ధోరణులు మళ్ళీ విజృంభించక ముందే చర్యలు తీసుకోవాలి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
చరిత్ర తెలంగాణ రాజకీయ నాయకత్వానికి ఒక అపూర్వమైన అవకాశాన్నిచ్చి, చాలా బాధ్యత పెట్టింది. (అట్లని రాజ్య స్వభావం పూర్తిగా మారుతుందని కాదు). తెలంగాణ యువత తమ త్యాగాల ద్వారా ఒక సుసంపన్నమైన ప్రజాస్వామ్య వారసత్వాన్నిచ్చారు. కనీస మానవ విలువలని, ప్రజాస్వామ్య ప్రమాణాలను కాపాడండని అడగడం తెలంగాణ ప్రజల హక్కు, అది పాలకుల బాధ్యత. చరిత్ర పరిణామం అంటే మానవ సంబంధాలు మానవీయ విలువల ఉన్నతీకరణే. కనీసం జీవించే హక్కును కాపాడాలి. మానవ చరిత్రంతా గౌరవంగా జీవించడం కొరకు మనిషి చేస్తున్న పోరాటాలే. తెలంగాణ ఉద్యమాన్ని, రాష్ట్ర అవతరణను ఆ నేపథ్యం నుంచే చూడాలి. తెలంగాణలో పౌరహక్కులు పూర్తి ప్రమాదంలో పడకూడదు.
ప్రొఫెసర్‌ జి. హరగోపాల్‌

No comments:

Post a Comment