Monday, 13 April 2015

ఇదా మన పోలీసు వ్యవస్థ? - జైళ్లశాఖ డీజీ వీకే సింగ్‌

ఇదా మన పోలీసు వ్యవస్థ? i జైళ్లశాఖ డీజీ వీకే సింగ్‌


రాజకీయాలకు, డబ్బుకు దాసోహమైంది
ప్రజలకు, పేదలకు వ్యతిరేకంగా పనిచేస్తోంది
జైళ్లశాఖ డీజీ వీకే సింగ్‌ ఆవేదన
పుస్తకరూపంలో అంతరంగ ఆవిష్కరణ
కర్నూలు, ఏప్రిల్‌ 12: ‘ప్రస్తుత పోలీసు వ్యవస్థ రాజకీయాలకు, డబ్బుకు దాసోహమైంది..’ అంటూ జైళ్లశాఖ డీజీ వీకే సింగ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. ప్రజల కు, పేదలకు వ్యతిరేకంగా పనిచేస్తోందని ఆవేదనగా చెప్పారు. ‘ఇదా మన పోలీసు వ్యవస్థ?’ అంటూ తన అంత రంగాన్ని ఆవిష్కరించారు. ఈ పుస్తకావిష్కరణ డీపీవోలోని వ్యాస్‌ ఆడిటోరియంలో జరిగింది. తనకు, తన కుటుంబానికి జరిగిన అన్యాయాలను, అనుభవాలను ఈ పుస్తకంలో రాశానని డీజీ చెప్పారు. పోలీసు వ్యవస్థలో తేవాల్సిన మార్పుల నూ వివరించానన్నారు. ‘బీహార్‌లో నా తండ్రి సాధారణ ఉపాధ్యాయుడు. అన్యాయాన్ని ఎదిరించినందుకు ఆయనను హత్యకేసులో ఇరికించారు. అవమానం భరించలేక అమ్మా నాన్నలు చనిపోయారు’ అని చెప్పారు. పోలీసుల వల్ల ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను భరించలేకే పోలీసు వ్యవస్థలో చేరి డీఎస్పీని అయ్యానని తెలిపారు. ఆ హోదాలోనూ ఏమీ ఒరగబెట్టలేక వ్యవస్థలో మార్పు కోసం ఐపీఎ్‌స అయ్యానన్నారు. ‘ఈ వ్యవస్థలో పోలీసులు ఏమీ చేయలేకపోతున్నారు. నిజాయతీగా, నిష్పక్షపాతంగా పోలీసులు ఎక్కువకాలం ఉండలేరు. రాజకీయ, ప్రాంతీయ ఒత్తిళ్లు ఉంటాయి’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్‌లాగా పోలీసు కమిషన్‌ ఏర్పడితేనే మంచి జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఇందుకు ఉదాహరణగా ఓ పిట్టకథ చెప్పారు. ‘ప్రభుత్వం కుక్కలను జైళ్లలో పెట్టాలని ఆదేశించింది. ఇది తెలిసి పారిపోతున్న ఓ ఆవును కారణమేమిటని ఏనుగు ప్రశ్నించింది. సమాధానం తెలుసుకుని.. జైల్లో పెట్టేది కుక్కలను కదా? మరి నీవు ఆవు కదా! అన్నది. ఆవునని నిరూపించుకోవడానికి ఈ పోలీసు వ్యవస్థలో 20 ఏళ్లు పడుతుంది. అంతవరకు జైలు తప్పదుగా అంటూ ఆవు ఉడాయించింది. చివరకు ఏనుగూ ఆవు బాటే పట్టింది. ఇలా చేయని తప్పులకు ఎంతోమంది జైళ్లలో మగ్గుతున్నారు. డబ్బులేకే బెయిల్‌పై బయటికి రాలేకపోతున్నారు. డబ్బు, రాజకీయ పలుకుబడి ఉన్నవారు సుప్రీంకోర్టు దాకా వెళ్లి కేసును నీరుగారుస్తున్నారు. ఇందుకు పోలీసులూ సహకరిస్తున్నారు’ అని చెప్పారు. పోలీసుల్లో రామన్‌ మెగసెసె అవార్డు పొందిన వారూ ఉన్నారని, వారు కేవలం పేరు కోసమే కృషిచేశారని ఆరోపించారు. వారు వ్యవస్థ కోసం పనిచేసి ఉంటే ఒక్క నెల కూడా ఉండలేరన్నారు. బిహార్‌లో అన్యాయాలను ఎదిరించినందుకు రాత్రికిరాత్రే వెనక్కి.. ఏపీకి పంపారన్నారు. తానొక విఫల పోలీసు అధికారినని అంగీకరించారు. జూనియర్‌ అఽధికారుల్లో అవినీతి గురించి చాలామంది చెబుతుంటారని, వాస్తవానికి సీనియర్‌ అధికారులే అవినీతిపరులన్నారు. సీనియర్లు కఠినంగా ఉంటే కింది వారు కూడా సక్రమంగా పని చేస్తారని తెలిపారు.

No comments:

Post a Comment