|
మానవత్వాన్ని మరచిన దానవులకు మానవ హక్కులు వర్తింపజేస్తూ విధి నిర్వహణాబద్ధులైన పోలీసుల మనోస్థైర్యాన్ని దెబ్బతీయటం ఎంతవరకు సబబు? అది సమాజానికి మేలు చేస్తుందా? విధి నిర్వహణలో ప్రతి ప్రభుత్వోద్యోగికి ‘ఫంక్షనల్ ఫ్రీడం’ ఉంటుంది. ఒకవేళ అటువంటిది దుర్వినియోగమైతే ఆయన పై అధికారి అందులోని మంచి చెడ్డలు నిర్ణయించాలి. అంతే కానీ బయటివారు కాదు. న్యాయస్థానాలకు వెళ్ళే హక్కు, ఉద్యోగి చర్యను తప్పకుండా సవాలు చేసే హక్కు ఎలాగూ ఉండనే ఉందికదా! ఈ మధ్యలోనే యాగీ చేయటం, పోలీసుల విధి నిర్వహణను తామే విమర్శించి రాద్ధాంతం చేయటం దేనికి?
‘ఎన్‌కౌంటర్ రాజకీయాలు’ శీర్షికతో ఏప్రిల్ 12వ తేదీన ఆంధ్రజ్యోతి లో ఆర్కే గారి విశ్లేషణ వాస్తవికతను, సామాన్యుని అంతరంగాన్ని ప్రతిబింబించింది. సహజంగానే ఆంధ్రజ్యోతిలోని అంశాలు నిజాలను నిర్భయంగా ప్రకటిస్తూ ఉంటాయి. అందుకు మీకు అభినందనలు తెలియజేస్తున్నాను. ఆర్కే చెప్పినట్లుగా నేటి రాజకీయ పక్షాలు తమ తమ వర్గ ప్రయోజనాలను కాపాడుకోవాలని, వోటు బ్యాంకును భద్రంగా ఉంచుకోవాలనే లక్ష్యంతో ప్రవర్తిస్తున్నాయే గానీ, విషయ ప్రాధాన్యాన్ని కానీ, దేశ ప్రయోజనాలనుకానీ, రాజ్యాంగ స్ఫూర్తిని గానీ, ప్రతిబింబించలేకపోతున్నాయి. ఇంకా కొన్ని సంస్థలు ఇజాలను వల్లిస్తున్నాయేగాని, నిజాలను ధైర్యంగా చెప్పలేకపోతున్నాయి.
రాజకీయ పక్షాలు అధికారంలో ఉన్నప్పుడు నీతి వాక్యాలు వల్లిస్తాయి, అధికారం కోల్పోగానే ప్రభుత్వ యంత్రాంగం మీద విరుచుకుపడతాయి. ముఖ్యంగా పోలీసు వ్యవస్థ మీద విమర్శల దండయాత్ర చేస్తాయి. ఇక మానవ హక్కుల పేరుతో కొన్ని సంఘాలవారు అదే పనిగా అరచి గీపెడతారు. నేరస్థుల కొమ్మకాయడానికి అన్ని విధాల ప్రయత్నిస్తారు. ఈ సందర్భలో ముష్కరుల దుష్కృత్యానికి బలియైున అమాయకులూ, వృత్తి ధర్మాన్ని పాటించిన పోలీసులూ మానవులేనన్న సంగతి అసలు పట్టించుకోరు. ఈ సందర్భంలో గడియారం వెంకట శేషశాసి్త్ర రాసిన ‘శివ భారతం’ కావ్యంలో సమర్థ రామదాసస్వామి శివాజీకి చేసిన ఉపదేశించిన ‘కావున భూపతీ..’ అనే పద్యం గుర్తుంచుకోవాలి.
ప్రభుత్వ యంత్రాంగంలో దండనీతి కూడా ఒక శాఖే. ఇందుకు ఉర్దూలో కూడా రెండు సామెతులున్నాయి- ‘ఫౌజ్‌దారీ మే గవాహ్ ఔర్ ముజ్రిమ్
దోనో బరాబర్ హై’- అని దండనీతిలో సాక్షి-నేరస్థుడు కూడా సమానంగానే భావించబడతారు అని అర్థం. మరొక సామెత కూడా గుర్తుంచుకోవాలి-
‘తల్వార్ ఔర్ ఖానూన్ తేజ్ రహనా చాహియే’- చట్టమూ- ఆయుధమూ వాడిగా ఉండాలి అని-
ఇక మానవ హక్కుల నేతలు ఒక్క విషయాన్ని మరచిపోతున్నారు. హక్కులూ-బాధ్యతలూ ఒకే నాణేనికి రెండు పక్కల వంటివి. హక్కును ప్రశ్నించిన వాళ్ళు బాధ్యతలను గుర్తుంచుకోవాలి. ఉగ్రవాదులుగా పిలవబడే బీభత్సకారులను అరాచకవాదులను, సంఘవిద్రోహులను ఉగ్రవాదులూ అని అనడమే తప్పు. ఉగ్రత్వం అంటే తాత్కాలికంగా చెలరేగిన ఆవేశపూరితమైన ఆగ్రహ తత్వం, ఉగ్రత్వం. అంతేకాక వ్యూహాత్మకంగా పకడ్బందీగా బాంబు పేలుళ్ళు జరుపుతూ, రాజ్యాంగ యంత్రాంగమైన పోలీసుల విధి నిర్వహణకు అడ్డుపడుతూ, వారిని కాల్చివేస్తూ, నిందిస్తూ, నిర్భీతిగా, తెగింపుతో తిరిగే బీభత్సకారులను సంఘ విద్రోహులు అనాలి. మరి అలాంటివారికి మానవ హక్కులు వర్తిస్తాయా?
మానవత్వాన్ని మరచిన దానవులకు మానవ హక్కులు వర్తింపజేస్తూ విధి నిర్వహణాబద్ధులైన పోలీసుల మనో స్థైర్యాన్ని దెబ్బతీయటం ఎంతవరకు సబబు? అది సమాజానికి మేలు చేస్తుందా? న్యాయశాస్త్రంలో ‘గుడ్ ఫెయిత్’ అనే ఒక మాట ఉంది. విధి నిర్వహణలో ప్రతి ప్రభుత్వోద్యోగికి ‘ఫంక్షనల్ ఫ్రీడం’ ఉంటుంది. ఒకవేళ అటువంటిది దుర్వినియోగమైతే దానిని నిర్వహించే ఉన్నతోద్యోగి అందులోని మంచి చెడ్డలు నిర్ణయించాలి. అంతే కానీ బయటివారు కాదు.
న్యాయస్థానాలకు వెళ్ళే హక్కు ఆ చర్యను తప్పకుండా సవాలు చేసే హక్కు ఎలాగూ ఉండనే ఉంది కదా! ఈ మధ్యలోనే యాగీ చేయటం, పోలీసుల విధి నిర్వహణను తామే విమర్శించి రాద్ధాంతం చేయటం దేనికి ? అయినా వికారుద్దీన్ ముఠా చేసిన దారుణాలు రహస్యంగా ఏమీ లేవు, పోలీసుల పట్ల అతని దురుసుతత్వం, తెగింపు ధోరణి మొదటి నుంచి అందరికీ తెలిసిందే కదా! మరి అలాంటివాడిని సమర్థుడని పేరున్న ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సమర్థించడమేమిటి? పోలీసులకు బహిరంగంగా మాట్లాడే స్వతంత్రం డిపార్ట్‌మెంట్ క్రమశిక్షణ రూల్స్ కారణంగా లేదు. మరి వారి ఆవేదనను అర్థం చేసుకునేవారెవరు?
ఇలాంటి విమర్శలు, అదేపనిగా చేస్తూ పోతే పోలీసుల్లో నిస్పృహ కానీ, ఉదాసీనతగానీ ఏర్పడితే పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి విజ్ఞులందరూ ఆలోచించాలి.
ఉమాపతి.బి.శర్మ
|
No comments:
Post a Comment