Thursday, 9 April 2015

ఆంధ్రా పోలీసులు పొట్టనబెట్టుకున్నారు

ఆంధ్రా పోలీసులు పొట్టనబెట్టుకున్నారు

Sakshi | Updated: April 09, 2015 03:28 (IST)
ఆంధ్రా పోలీసులు పొట్టనబెట్టుకున్నారు
నాబిడ్డను అన్యాయంగా చంపేశారు
 కూలి పని కోసం వచ్చిన నా బిడ్డను పోలీసులు అన్యాయంగా కాల్చి చంపేశారు. పోలీసుల అరాచకం ఎవరికి చెప్పుకోవాలి. మా కుటుం బాన్ని ఎవరు ఆదుకుంటారు. దీనికి సమాధానం ఎవరు చెబుతారు. దీనికి బాధ్యత ఎవరూ వహిస్తారు?-పద్మ, (మృతిచెందిన కూలీ మునస్వామి తల్లి) మురుగంబాడి, తిరువణ్ణామలై జిల్లా

 తిరుచానూరు : ఆంధ్రా పోలీసులు తమ వారిని పొట్టనబెట్టుకున్నారని ఎన్‌కౌంటర్ మృతుల బంధువులు ఆరోపించారు. తిరుపతి పరిసరాల్లోని శేషాచలం కొండల్లో మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్లో మృతిచెందిన 20 మంది ఎర్రకూలీల మృతదేహాలకు బుధవారం తిరుపతి రుయాలో పోస్టుమార్టం పూర్తి చేశారు. ఏడింటిని బంధువులకు అప్పగించారు. తమిళనాడు రాష్ట్రం తిరువణ్ణామలై జిల్లా అనందపురం తాలూకా వేటగిరిపాళ్యంకు చెందిన శశికుమార్, పెరుమాళ్, మురుగన్, కాలసముద్రానికి చెందిన పళణి, మురుగంబాడికి చెందిన మూర్తి, మునస్వామి, కొల్లపాడు గాంధీనగర్‌కు చెందిన మహేంద్రన్ కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నట్లు బంధువులు, గ్రామస్తులు పేర్కొన్నారు.

  తిరుపతిలో తాపీమేస్త్రీ పనులు చేసుకుని నాలుగు డబ్బులు సంపాదిద్దామని ఈనెల 6వ తేదీ సోమవారం ఊరి నుంచి మొత్తం 8 మంది బయలుదేరారని చెప్పారు. నగరి-పుత్తూరు మధ్య ఆంధ్రా పోలీసులు ఏడుగురిని అదుపులోకి తీసుకోవడంతో మరో వ్యక్తి ఇంటికి తిరిగొచ్చాడని పేర్కొన్నారు. మంగళవారం బెయిలుపై వారిని తీసుకొద్దామని అనుకునేలోపు ఎన్‌కౌంటర్లో మృతిచెందారని టీవీల్లో వార్తలు చూసి నిర్ఘాంతపోయామని పేర్కొన్నారు. ఏ తప్పూ చేయని తమ వారిని ఎన్‌కౌంటర్ పేరుతో హతమార్చడం దుర్మార్గమని, దీనిపై తమకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని తెలిపారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

 ఎన్‌కౌంటర్‌పై విచారణ జరిపించాలి
 ఆంధ్రా పోలీసులు నిర్వహించిన బూటకపు ఎన్‌కౌంటర్‌పై విచారణ జరిపించి, సంబంధిత పోలీసు అధికారులు, సిబ్బందికి శిక్ష  వేయాలి. పనులు లేక సంపాదన కోసం వచ్చిన తమ బావమరిది శశికుమార్‌ను పొట్టనపెట్టుకున్నారు. భార్య, ఇద్దరు పిల్లలకు ఆంధ్రా ప్రభుత్వం, పోలీసులు ఏం సమాధానం చెబుతారు.
 - రాజవేలు, మృతుడు శశికుమార్ బావ, వేటగిరిపాళ్యం

 ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్య
 ఇది ముమ్మాటికీ ఆంధ్ర ప్రభుత్వ హత్య. కూలి పనుల కోసం వచ్చిన వాళ్లను ఆంధ్రా పోలీసులు మార్గమధ్యంలో అదుపులోకి తీసుకుని దారుణంగా కాల్చి చంపి ఎన్‌కౌంటర్‌గా చిత్రీకరించారు. మృతుడు పళణికి 3 నెలల క్రితమే బిడ్డ జన్మించింది. ఆ బిడ్డకు, అతని భార్యకు ఆంధ్ర ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది.
 - అయూబ్, మృతుడు పళణి సోదరుడు, కాలసముద్రం

 తాపీమేస్త్రీ పనులకొచ్చాడు
 నా తమ్ముడు మునస్వామి తాపీమేస్త్రీ పనులకని చెప్పి తిరుపతికి బయలుదేరాడు. పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిసి బెయిల్‌పై తీసుకొద్దామని అనుకున్నా. ఇంతలో నా తమ్ముడిని పోలీసులు ఎన్‌కౌంటర్ పేరుతో కిరాతకంగా చంపేశారు. ఇది ఏపీ ప్రభుత్వ హత్య.
 - కరుణాకరన్, మృతుడు మునస్వామి అన్న,
 మురుగంబాడి

 తీవ్రవాదుల కంటే దారుణంగా చంపారు
 మా గ్రామస్తులను తీవ్రవాదుల కంటే అతి దారుణంగా ఆంధ్రా పోలీసులు కాల్చి చంపేశారు. పైగా తమపై దాడికి పాల్పడడంతో  ఎదురుకాల్పులు జరపడంతో మృతి చెందారని చెప్పడం హాస్యాస్పదం. అసలైన నేరగాళ్లు, కోట్లకు పడగెత్తిన బడా స్మగ్లర్లను వదిలేసి పాపం పుణ్యం తెలియని అమాయకులను పొట్టన పెట్టుకోవడం ఎంతవరకు సమంజసం.
 - పళణిస్వామి, మాజీ కౌన్సిలర్, అనందపురం, తిరువణ్ణామలై జిల్లా

 చంపే హక్కు ఎవరు ఇచ్చారు
 కూలి పనికోసం వచ్చిన నా బిడ్డను చంపే హక్కు పోలీసులకు ఎవరు ఇచ్చారు. నా బిడ్డను పట్టుకుంది పుత్తూరు దగ్గర. అతన్ని తిరుపతికి తీసుకొచ్చి కాల్చి చంపేశారు. తప్పు చేసి ఉంటే చట్టాలున్నాయి. న్యాయస్థానాలు ఉన్నాయి. మా కుటుంబానికి ఇక దిక్కెవరు.
 - పద్మ, మృతుడు మునస్వామి తల్లి,
 మురుగంబాడి.

 తమ్ముడి కుటుంబానికి దిక్కెవరు
 నా తమ్ముడిని అన్యాయంగా ఆంధ్రా పోలీసులు కాల్చి చంపేశారు. కూలికి వెళ్లి వస్తానని చెప్పి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు.  ఇక నా తమ్ముడి కుటుంబానికి దిక్కెవరు. మాకు జరిగిన అన్యాయానికి బదులు చెప్పాల్సిందే.
 - లక్ష్మి, మృతుడు పెరుమాళ్ అక్క, వేటగిరిపాళ్యెం,
 తిరువణ్ణామలై జిల్లా

No comments:

Post a Comment