అటవీ స్మగ్లర్లకు రాజకీయ నేతలు అండగా నిలబడటంతో అటవీ శాఖ అధికారులు, సిబ్బంది నిస్సహాయులై అదుపు చేయలేని స్థితి నెలకొన్నది. విదేశాల్లో ఎర్ర చందనానికి పెద్దఎత్తున డిమాండ్ ఉండటంతో తమిళనాడు లాంటి ప్రాంతాల నుంచి వందలాది మందిని రప్పించి భారీగా అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. పోలీసులు ఇటీవల ఎర్రచందనం స్మగ్లింగ్‌ను సమర్ధంగా నిరోధించి శేషాచల అడవుల సంరక్షణకు నాంది పలికారు.
తెలుగుదేశం ప్రభుత్వం అధికారం చేపట్టిన తక్షణమే ఎర్రచందనం స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపింది. ఎర్ర చందనం అడవులను రక్షిస్తోంది. స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ కేసుల్లో స్వాధీనమైన ఎర్ర చందనం నిల్వల మూలంగా వేల కోట్ల సొమ్ము ప్రభుత్వ ఖజానాకు చేరుతోంది. ఇప్పటికే తొలి విడత వేలంలో తొమ్మిది వందల కోట్ల రూపాయలకు పైగా ఆదాయం వచ్చింది. మరోసారి వేలంలో వేయి కోట్ల రూపాయిలు ప్రభుత్వ పరం కానున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అటవీ సంపద పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించడంలో భాగంగా స్మగ్లర్ల ఆగడాలకు అడ్డుకట్టు వేయడానికి పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. డీజీపీ జె.వి. రాముడు నాయకత్వంలో సమర్ధ పోలీసు అధికారులను నియమించారు. ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌కు అవసరమైన మందీ మార్బలాన్ని, ఆయుధ సంపత్తి సమకూర్చారు. ఫలితంగా పది నెలల కాలంలోనే స్మగ్లింగ్ నిరోధం, శేషాచల అడవుల సంరక్షణకు నాంది పలికారు.
మొన్నటి వరకూ అధికారం చెలాయించిన కాలంలో కాంగ్రెస్ నేతలు, వైకాపా నాయకుల అనుచర ముఠాలు ఎర్రచందనం నరుక్కొని కోట్లు కొల్లగొట్టారు. కాపలాగా వెళ్లిన ఫారెస్టు అధికారులను హత్యలు చేశారు. ఇప్పటివరకు అటవీ అధికారులు జరిపిన దాడుల్లో రూ.20 వేల కోట్ల విలువగల కలప పట్టుబడటం స్మగ్లింగ్ తీవ్రతను తేటతెల్లం చేస్తోంది. 2004-14 మధ్య పట్టుబడకుండా స్మగ్లర్లు ప్రభుత్వానికి, ప్రజలకు చెందాల్సిన వేల కోట్ల రూపాయల విలువైన వనరులను కైంకర్యం చేశారు. అటవీ సంపద రక్షణలో అమాయక పోలీసు, అటవీ సిబ్బంది తమ ప్రాణాలను పోగొట్టుకోవడం దురదృష్టకరం. అటవీ స్మగ్లర్లకు రాజకీయ నేతలు అండగా నిలబడటం దుర్మార్గం. అటవీ శాఖ అధికారులు, సిబ్బంది నిస్సహాయులై అదుపు చేయలేని స్థితి నెలకొనడం దయనీయం. విదేశాల్లో ఎర్ర చందనానికి పెద్ద ఎత్తున డిమాండ్ ఉండటంతో మన రాష్ట్రంలో స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. తమిళనాడు లాంటి ప్రాంతాల నుంచి వందలాది మందిని రప్పించి భారీగా అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని ఇటీవల పోలీసుల సమర్థ చర్య మూలంగా అరెస్టయిన వ్యక్తుల నుంచి సమాచారం లభిస్తుండటం గమనార్హం.
ఎన్నాళ్ళగానో ఎర్రస్మగ్లర్లను ప్రోత్సహిస్తున్న పలు పార్టీల నాయకులపై చర్యలు తీసుకోకుండా కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అధికార వర్గాలు అడ్డుపడటమే స్మగ్లింగ్ ఇష్టారాజ్యంగా మారింది. 2012 జూన్‌లో రూ.120 కోట్ల విలువ చేసే ఎర్రచందనంను స్వాధీనం చేసుకున్నా, అందుకు సూత్రధారులెవ్వర్నీ ప్రభుత్వం అరెస్టు చేయలేదు. 1300 మంది కూలీలపై కేసులు మాత్రం నమోదు చేసి చేతులు దులుపుకున్నారు. అధికార కాంగ్రెస్ నేతలు అసలు స్మగ్లర్లకు కొమ్ముకాశారు. కడప జిల్లా వైకాపా నాయకుని తమ్ముడొకరు మరో వీరప్పన్‌గా అవతారమెత్తాడు. నాటి నుంచి నేటి వరకూ చిత్తూరు జిల్లాకు చెందిన వైకాపా నాయకులు స్మగ్లర్లకు అండగా ఉంటూ ఫారెస్టు అధికారులపై దాడులకు పాల్పడ్డారు. ఆయా నేతలపై సెక్షన్ 143, 147, 447, 232, 353, 225 కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు చంద్రబాబు అధికారంలోకి రావడంతో ఎర్రస్మగ్లర్లు, ఈ నేతలకు దిక్కుతోచని స్థితి ఎదురయింది. ఎన్నిసార్లు ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసినా లెక్క చేయకుండా మళ్ళీ మళ్లీ అడవుల్లో ప్రవేశించి యధేచ్ఛగా ఎర్రచందనం చెట్ల స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నారు. గతంలో స్మగ్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటనలకే పరిమితమయింది. ఆయుధాలివ్వకుండా అటవీ ప్రాంతంలో సాయుధులైన స్మగ్లర్లను అటవీ సిబ్బంది ఎలా అదుపు చేస్త్తారన్నది ఏ నాయకుడు పట్టించుకోలేదు.
శేషాచల అడవుల్లో గతంలోనే ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న బెంగళూరు, చెన్నైలకు చెందిన స్మగ్లర్లు కూలీలను సరఫరా చేస్తున్న 52 మంది మేసీ్త్రల పేర్లు అటవీ శాఖ అధికారులకు చిక్కాయి. తమిళనాడులోని తిరువన్నామలై, పోలూరు, సేలం, వేలూరు, ధాయిమంగరు జిల్లాతో పాటు ఆంధ్రలోని రైల్వే కోడూరు, పలమనేరు, కడప జిల్లాకు చెందిన వారు. అప్పుడే ఈ స్మగ్లర్లపై పకడ్బందీగా కేసులు నమోదు చేసి శిక్షలు పడేట్లు చేయకపోవడంతో వారు మరింత రెచ్చిపోయి వ్యవహరిస్తున్నారు.
అటవీ దొంగ వీరప్పన్ హతమయ్యాక తమిళనాడు, కర్ణాటకల్లోని అతని అనుచరులు చెల్లాచెదురయ్యారు. వారంతా బృందాలుగా ఏర్పడి చిత్తూరు, కడప జిల్లాల్లోని ఎర్రచందనం వనాలను కబళిస్తున్నారు. ఎర్ర చందనం ధర అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.25 లక్షల పై చిలుకే. స్మగ్లర్లు పట్టుబడినా టన్ను ఎర్ర చందనం అమ్మినా 12 శాతం ఎక్కువగా లాభాలు వస్తున్నప్పుడు దీన్ని అక్రమంగా రవాణా చేయడానికి స్మగ్లర్లు వెనకాడటం లేదు. చిత్తూరు జిల్లాలో స్మగ్లర్ల ముఠా యధేచ్ఛగా అటవీ సిబ్బంది, అధికారులపై దాడులు చేయడం సర్వసాధారణంగా మారింది. 2011 జూలైలో అటవీ శాఖాధికారి ఎం. శ్రీనివాసులును 150 మంది స్మగ్లర్లు దారుణంగా హతమార్చారు. దశాబ్దకాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జమానాలో విచ్చలవిడి అవినీతి, రాష్ట్ర అటవీ, ఖనిజ సంపద ఎలా దోచుకున్నారో దీన్నిబట్టి స్పష్టమవుతోంది. ఎర్రచందనం స్మగ్లర్లు ఎంతకయినా తెగిస్తారనడానికి రెండేళ్ళక్రితమే ఇటువంటి సంఘటనలు జరిగినా రాష్ట్ర ప్రభుత్వం దీనిని సీరియస్‌గా తీసుకోలేదని తెలుస్తోంది. ఫలితంగా ఎర్రచందనం స్మగ్లర్ల అరాచకాలు మితిమీరడానికి కారణమయింది.
స్మగ్లర్ల నుంచి అటవీ శాఖ స్వాధీనం చేసుకున్న 10 వేల టన్నుల ఎర్ర చందనం నిల్వలున్నాయి. వీటిని విదేశాలకు ఎగుమతి చేస్తే ప్రభుత్వానికి రూ. 5 వేల కోట్లు ఖజానాలోకి చేరతాయి. వేలంలో 3,615 మెట్రిక్ టన్నుల ఎర్ర చందనం అమ్మగా రూ.991 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. ఇంకా నిల్వ ఉన్న 5 వేల మెట్రిక్ టన్నుల ఎర్రచందనం వేలానికి సిద్ధం చేస్తున్నామని అటవీ శాఖ ప్రకటించడంతో కనీసం మరో వేయి కోట్లు రావడం ఖాయంగా కనిపిస్తుందటం శుభసూచకం. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ అధికారంలోకి రాగానే వేసిన వేలంలో సుమారు వెయ్యి కోట్ల రూపాయలు ఆదాయం రావడం ప్రజా విజయంగా పరిగణించాలి.
జాస్తి గోపాల్ ప్రసాద్
సీనియర్ జర్నలిస్ట్
No comments:
Post a Comment