Wednesday, 15 April 2015

శేషాచలం నుంచి బెంగళూరు రూటు మార్చిన ఎర్రదొంగలు

శేషాచలం నుంచి బెంగళూరు రూటు మార్చిన ఎర్రదొంగలు
కర్నూలు, అనంతపురం
మీదుగా అక్రమ రవాణాకు యత్నం
పసిగట్టిన ఏపీ పోలీసులు...
నల్లమలలో కూంబింగ్‌ ముమ్మరం
హైదరాబాద్‌, ఏప్రిల్‌ 14 (ఆంధ్రజ్యోతి):ఎర్ర దొంగలు రూటు మారుస్తున్నారు. శేషాచలం అడవులపై పోలీసులు పట్టుబిగించడంతో తమ కార్యకలాపాలకు నల్లమల అడవులనూ ఉపయోగించుకుంటున్నారు. అటు నుంచి కర్నూలు, బళ్లారి జిల్లాల మీదుగా ఎర్రదుంగలను రహస్యంగా తరలించేందుకు పథకాలు వేస్తున్నారు. అయితే ఈ విషయాన్ని పసిగట్టిన ఏపీ పోలీసులు అప్రమత్తమయ్యారు. రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో బందోబస్తు పెంచారు. శేషాచలం అడవుల్లో ఇటీవల ఎన్‌కౌంటర్‌ జరిగిన తర్వాత ఎర్రదొంగల దూకుడు తగ్గుతుందని అందరూ భావించారు. అయినా ఇప్పటికీ ఎర్రదొంగలు అడవుల్లోకి ప్రవేశిస్తున్నారు. తాజాగా అటవీశాఖ సిబ్బందికి అందిన సమాచారం ప్రకారం ఎర్రదొంగలు నల్లమల అడవిలోకి ప్రవేశించారు. శేషాచలం అడవుల్లోకి ఎన్‌కౌంటర్‌ రోజు ప్రవేశించిన 150మంది దొంగల్లో 20మంది కాల్పుల్లో మరణించగా మరో 50మంది పట్టుబడ్డారు. మరికొందరు తప్పించుకొని పారిపోయారు. వారంతా నల్లమల వైపు వెళ్లిపోయినట్లు అటవీసిబ్బందికి సమాచారం అందింది. నల్లమలలో ఎర్రదొంగలున్న విషయం కర్నూలు, ప్రకాశం జిల్లాల పోలీసులకు ఆదివారం తెలిసింది. దీంతో అక్కడ కూడా కూంబింగ్‌ మెదలెట్టారు. గత కొంతకాలంగా ఎర్ర దుంగలను శేషాచలం అడవి నుంచి తరలించాలంటే నెల్లూరు, కడప, తిరుపతి, చిత్తూరు పోలీసులు అడ్డుపడుతున్నారు. దీంతో నల్లమలకు అడవి మార్గంలో మోసుకెళ్లి అటునుంచి కర్నూలు జిల్లా మీదుగా బళ్లారి, అనంతపురం జిల్లా మీదుగా బెంగళూరుకు తరలిస్తున్నట్లు పోలీసు, అటవీసిబ్బందికి సమాచారం అందింది. ఈ నేపథ్యంలో కర్నూలు, అనంతపురం పోలీసులు అప్రమత్తమయ్యారు. కూంబింగ్‌ మరింత ముమ్మరం చేశారు. అనంతపురం ఎస్పీ రాజశేఖర్‌బాబు తిరుపతి ఎస్పీగా ఉన్నప్పుడు ఎర్ర దొంగలను బాగా కట్టడి చేశారు. దీంతో ఎర్రచందనం స్మగ్లర్లు అదేస్థాయిలో పైఎత్తు వేసి ఆయిల్‌ ట్యాంకర్లు, పాలవ్యాన్లు లాంటి వాటిలో ఎర్రచందనం దుంగల్ని తరలిస్తున్నట్లు సమాచారం. విషయం ఏపీ పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌కు తెలియడంతో డీజీపీ జేవీ రాముడు స్వయంగా ఆయా జిల్లాల ఎస్పీలతో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇదిలా ఉండగా నల్లమల అటవీ ప్రాంతాన్ని ప్రత్యేక దళం పోలీసులు నలుమూలలా జల్లెడ పడుతున్నారు. ఇక్కడా కూంబింగ్‌ ముమ్మరమవడంతో ఎర్రదొంగలు ఎటువెళ్లాలో దిక్కుతోచక అవకాశం ఉన్న మార్గాల్లో అడవినుంచి బయటపడి తమిళనాడు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఎన్‌కౌంటర్‌ జరిగిన నాటి నుంచి అటవీ సిబ్బంది, కూంబింగ్‌ పోలీసులకు శేషాచలం అడవిలో పదుల సంఖ్యలో సెల్‌పోన్లు దొరికాయి. వాటిలో ఉన్న సిమ్‌ నెంబర్ల ఆధారంగా ఏపీ సీఐడీ పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టినట్లు సమాచారం.
మనం తప్పుచేయలేదు... కేసు కట్టండి డీజీపీ ఆదేశం
శేషాచలం ఎన్‌కౌంటర్‌లో మరణించిన ఎర్రకూలీ శశికుమార్‌ భార్య మునియమ్మాళ్‌ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేయాలని తిరుపతి పోలీసులను ఏపీ డీజీపీ జేవీ రాముడు ఆదేశించినట్లు తెలిసింది. బస్సులో ప్రయాణిస్తున్న తన భర్తను రెడ్‌శాండిల్‌ స్మగ్లింగ్‌ యాంటీ స్క్వాడ్‌ పోలీసులు అడవిలోకి తీసుకొచ్చి కాల్చి చంపారని ఆదివారం ఆమె చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె వెనుక సీనియర్‌ న్యాయవాదులుండటం, ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించిన డీఎస్పీ స్థాయి అధికారిని తమిళ న్యాయవాదులు అడ్డుకోవడం తదితర విషయాలను తిరుపతి పోలీసులు డీజీపీ కార్యాలయానికి తెలియజేశారు. ‘ఎన్‌కౌంటర్‌ విషయంలో మనం తప్పుచేయలేదు. కూలీ భార్య ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయండి’ అని డీజీపీ తిరుపతి పోలీసులను ఆదేశించినట్లు సమాచారం.

No comments:

Post a Comment