Saturday, 11 April 2015

మా గాయం మాటేమిటి? - అటవీ అధికారుల కుటుంబ సభ్యులు

మా గాయం మాటేమిటి?

మా వాళ్లను చిత్రహింసలు పెట్టారు
అవయవాలు కోసి చంపేశారు
15 నెలలుగా నిత్యం కన్నీరే
స్మగర్లకు మాత్రమే హక్కులా!?
ఉద్యోగులను మాత్రం చంపొచ్చా!
అటవీ అధికారులు శ్రీధర్‌, డేవిడ్‌ కుటుంబ సభ్యుల ప్రశ్న
కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న ఈమె పేరు... హెలెన్‌ మేరీ! 2013 డిసెంబర్‌ 15న శేషాచలం అడవుల్లో, ఎర్ర చందనం దొంగల చేతిలో మరణించిన అటవీ అధికారి డేవిడ్‌ సతీమణి! ‘ఎర్రచందనం దొంగల ఎన్‌కౌంటర్‌ అన్యాయమైతే... మా వాళ్లను ఎర్ర దొంగలు చంపడం న్యాయమా?’... ఇదీ హెలెన్‌ మేరీ ప్రశ్న!
(తిరుపతి-ఆంధ్రజ్యోతి): నాణేనికి రెండు పార్శ్వాలుంటాయి! ప్రతి అంశం వెనుక రెండు కోణాలుంటాయి! ప్రతి మరణం వెనుకా ఒక కుటుంబం ఆవేదన ఉంటుంది. పోలీసు కాల్పుల్లో మరణించిన వారి కుటుంబాల్లో విషాదం! విధి నిర్వహణలో ఉండగా దుండగుల చేతిలో చనిపోయిన వారి కుటుంబాలది పెను విషాదం! శేషాచలంలో ఎర్ర దొంగల ఎన్‌కౌంటర్‌ అక్రమం, అన్యాయం అంటూ కొన్ని పార్టీలు, కొన్ని ప్రజా సంఘాలు నినదిస్తుండగా... 15 నెలల క్రితం అదే ఎర్ర దొంగల చేతిలో తమ వారిని కోల్పోయిన అటవీ అధికారుల కుటుంబ సభ్యులు మాత్రం ఇందుకు భిన్నంగా స్పందిస్తున్నారు. ‘స్మగ్లర్లను చంపితేనే మానవ హక్కుల ఉల్లంఘన అవుతుందా? ఉద్యోగులను చంపితే వర్తించదా?’ అని ప్రశ్నిస్తున్నారు. 2013 డిసెంబర్‌ 15న శేషాచలం అడవుల్లో అటవీ అధికారులు శ్రీధర్‌, డేవిడ్‌లను ఎర్ర చందనం దొంగలు దారుణంగా చంపేశారు. రాళ్లతో రక్తం వచ్చేలా కొట్టారు. చెట్లకు కట్టేశారు. అవయవాలను కోసేశారు. వదిలేయాలని, బతుకునివ్వాలని బతిమాలినా కనికరించలేదు. వారి మృతదేహాలు చూసి కుటుంబ సభ్యుల గుండె పగిలినంత పనైంది. ఆ ఇద్దరు గృహిణులు, ఇతర కుటుంబ సభ్యులు దాదాపు 15 నెలల తర్వాత ఈ అంశంపై స్పందించారు. వారు ఏమన్నారంటే...
అన్నను కోల్పోయాం!
2013 డిసెంబరు 15న స్మగ్లర్లు అడవిలో మా అన్న డేవిడ్‌పై దాడిచేశారని తెలిసిన వెంటనే నేను పాపవినాశనం పెద్దచేనుబండ ప్రాంతానికి వెళ్లా. మా అన్నను చాలా క్రూరంగా, అమానుషంగా చంపారు. కత్తులు, కర్రలు, గొడ్డళ్లు, రాళ్లతో దాడిచేసి చంపారు. ఇప్పుడు రాజకీయ నాయకులు, మానవహక్కుల సంఘాల వాళ్లు ఎన్‌కౌంటర్లలో చనిపోయినవారికి ఏ న్యాయం జరగాలంటున్నారో... అదే న్యాయం మాకూ కావాలి. మా అన్నను చంపిన ఎర్రదొంగలను ఒక్కరిని కూడా ప్రభుత్వం వదల కూడదు.
- పూర్ణ శరత్‌చంద్ర, డేవిడ్‌ తమ్ముడు
చంద్రబాబే ధైర్యం చెప్పాడు
నా బిడ్డను ఎర్రదొంగలు చంపినప్పుడు... ప్రతిపక్షంలో ఉన్నా చంద్రబాబు మా ఇంటికి వచ్చి ధైర్యం చెప్పారు. ఆర్థికసాయం చేశారు. అధికారంలోకి వస్తే ఎర్రదొంగలను నియంత్రిస్తామని, స్మగ్లింగ్‌ అరికడతామని చెప్పారు. ఆమాట ప్రకారమే స్మగ్లర్ల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఆనాడు అటవీ అధికారులకు ఆయుధాలు లేకపోవడంతో స్మగ్లర్ల చేతుల్లో చనిపోయారు. ఇప్పుడు ఆయుధాలు ఉన్నందునే 300 మంది దాడిచేసినా పోలీసులు ఎదుర్కోగలిగారు. ఎన్‌కౌంటర్లు జరగాలని ఎవరూ కోరుకోరు. అయితే... విధి నిర్వహణలో ఉండేవాళ్లవి కూడా ప్రాణాలే. వారికీ తల్లిదండ్రులు, భార్యాబిడ్డలు ఉంటారనేది ఇప్పుడు ఆందోళన చేస్తున్న పార్టీలు గుర్తించాలి.
- జార్జి, డేవిడ్‌ తండ్రి
మాకూ న్యాయం చేయాలి!
మా శ్రీధరన్నను అడవిలో ఎర్రదొంగలు దారుణంగా చంపారు. మా అన్న పిల్లలు తండ్రి లేనివారయ్యారు. ఇప్పుడు ఎన్‌కౌంటర్‌పై పోరాడుతున్న హక్కుల సంఘాలు మాకూ న్యాయం చేయాలి. మా అన్నను చంపిన హంతకులకు శిక్షవేయాలి. రాజకీయ లబ్ధికోసం రాద్ధాంతం చేస్తున్న పార్టీలు కూడా తమ వైఖరి మార్చుకోవాలి.
- ఎన్‌.ఆర్‌.రమేశ్‌, శ్రీధర్‌ తమ్ముడు.

No comments:

Post a Comment