Tuesday, 14 April 2015

ఎర్ర దొంగలు దోచేసింది లక్ష కోట్లు!

ఎర్ర దొంగలు దోచేసింది లక్ష కోట్లు!
దాంతో నవ్యాంధ్ర రాజధాని నిర్మించొచ్చు
ఎర్రచందనం దోపిడీలో తమిళ స్మగ్లర్లే కీలకం
శేషాచలంలో ఎర్రవనాల విస్తీర్ణం 2.5 లక్షల హెక్టార్లు
ఇప్పటికే 50 వేల హెక్టార్లను నరికేశారు
తిరుపతి, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): శేషాచలం అడవుల్లో ఇప్పటి వరకు ఎర్ర దొంగల పాలైన ఎర్ర చందనానికి విలువ కడితే అక్షరాలా లక్ష కోట్లుగా తేలుతుందని అధికారుల అంచనా. ఈ మొత్తంతో నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం పూర్తిచేసుకోవచ్చు. ఇంత విలువైన సంపద స్మగ్లర్ల పాలవుతుండటం వల్లే, అసలే ఆర్థికకష్టాల్లో సతమతమవుతున్న ఏపీ సర్కార్‌ ఎర్ర స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపుతోంది. విలువైన సంపదను రక్షించుకునేందుకు తాపత్రయపడుతోంది. శేషాచలం అడవుల్లో 2.5 లక్షల హెక్టార్లలో ఎర్రచందనం వనాలు విస్తరించి ఉన్నాయి. తాజాగా ఫారెస్టు అధికారులు చేసిన సర్వే ఆధారంగా 50వేల హెక్టార్లలో ఎర్రచందనం వృక్షాలను ఎర్ర దొంగలు నరుక్కుపోయారు. ఈ 50వేల హెక్టార్లలో 80 శాతం ఇటీవల మూడు నాలుగు సంవత్సరాల్లోనే అంతరించిపోయాయని అటవీ అధికారులు పేర్కొంటున్నారు. ఇటీవల ఎర్రచందనాన్ని రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ మార్కెట్‌లో విక్రయానికి పెడితే ఏ గ్రేడ్‌ టన్నుకు రూ.1.80కోట్లు, బి గ్రేడ్‌ రూ.50 లక్షలు, సి గ్రేడ్‌ రూ.15 లక్షలు పలికింది. అంటే అంతర్జాయతీ మార్కెట్‌లో ఎర్రచందనం టన్ను సగటు విలువ కోటి రూపాయలపైమాటే. 50వేల హెక్టార్లలో ఎర్ర దొంగలు నరుక్కుపోయిన ఎర్రచందనం లక్ష టన్నులకుపైగా ఉంటుందని, దాని విలువ లక్ష కోట్ల రూపాయలకుపైటే అని అటవీ అధికారులు పేర్కొంటున్నారు. ఎర్ర సంపదను కొల్లగొడుతున్నది ప్రధానంగా తమిళ స్మగ్లర్లే. గత నాలుగేళ్లలో ఎర్రచందనం స్మగ్లింగ్‌లో వీరి పాత్ర గణనీయంగా పెరిగింది. మొదట్లో ఎర్రచందనాన్ని అక్రమంగా విదేశాలకు తరలించడం వరకే వీరి పాత్ర పరిమితమైంది. ప్రస్తుతం కట్టర్లు మొదలు మేసీ్త్రలు, డ్రైవర్లు అంతా తమిళులే. స్మగ్లర్లలో ఒకరిద్దరు ఏపీ, కర్ణాటకకు చెందిన వారున్నా అధికశాతం మాత్రం తమిళులే. ముఖ్యంగా తమిళనాడులోని వేలూరు, విల్లుపురం, ధర్మపురి, సేలం, తిరువణ్ణామలై జిల్లాలకు చెందిన వారు ఎర్ర చందనం స్మగ్లింగ్‌లో కీలకపాత్ర పోషిస్తున్నారు. గత నాలుగేళ్లలో తమిళనాడుకు చెందిన 10వేల మంది ఎర్ర చందనం స్మగ్లింగ్‌ కేసుల్లో ఏపీ పోలీసులు అరెస్ట్‌ చేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
స్మగ్లర్లలో కీలకమైనవారి వివరాలు ఇవీ..
బడా స్మగ్లర్‌
చెన్నై రెడ్‌హిల్స్‌ ప్రాంతంలోని సొలైమాన్‌నగర్‌లో నివాసం ఉండే షణ్ముగం పాల్‌రాజ్‌ బడా స్మగ్లర్‌. విదేశాలకు ఎర్ర దుంగలు పంపడంలో కీలకపాత్ర ఇతనిదే. ఒకేసారి కొన్ని వందల టన్నుల ఎర్రచందనాన్ని షిప్పుల ద్వారా దుబాయ్‌కి రవాణా చేస్తుంటాడు. ఇతనికి దుబాయ్‌ నుంచి ఎర్రచందనం స్మగ్లింగ్‌ను నిర్వహించే షాహుల్‌ హమీద్‌తో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి. నేరుగా మేసీ్త్రల నుంచి, మొదటి, రెండో శ్రేణి స్మగ్లర్ల నుంచి షణ్ముగం సరుకు కొనుగోలు చేస్తాడు. వాళ్లకు ముందస్తు పెట్టుబడులు సమకూరుస్తాడు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ అభియోగాలపై 2014 జనవరి 4న షణ్ముగంని అరెస్ట్‌ చేశారు.
- షణ్ముగం పాల్‌రాజ్‌ అలియాస్‌ బాల్‌రాజ్‌
మేసీ్త్రలు
ఎర్రచందనం స్మగ్లింగ్‌కి వీరే మూల స్తంభాలు. క్షేత్రస్థాయిలో కట్టర్లను అడవుల్లోకి పంపడం మొదలు వారికి దారి చూపే పైలట్లు, రవాణా కోసం దొంగ వాహనాలను, డ్రైవర్లను సమకూర్చడం, ఆహారం అందించడం అంతా వీరి చేతుల మీదుగానే జరుగుతుంది. కట్టర్లకు కిలోకు రూ.300 చొప్పున చెల్లిస్తారు. ఉంటుంది. దుంగలనుస్మగ్లర్లకు చేరవేస్తే మేసీ్త్రలకు కమిషన్‌ ముడుతుంది. అరెస్టయిన మేస్ర్తీల్లో కొందరు...
టి.జి. గణేష్‌
ఇతనిది సేలం జిల్లా ఓమలూరు. 2013 సెప్టెంబర్‌ 26న అరెస్టు చేశారు.
పి.ఎం. సెంథిల్‌ కుమార్‌
ఇతనిది వేలూరు జిల్లా వాణియంబాడి. 2013 అక్టోబర్‌ 25న అరెస్టు చేశారు.
కె. కుప్పస్వామి
ఇతనిది వేలూరు జిల్లా తిరుపుత్తూరు. 2014 మార్చి 11న అరెస్ట్‌.
స్టేజ్‌-2 స్మగ్లర్లు
వీరు మేసీ్త్రలను పోషిస్తూ స్టేజ్‌-1 స్మగ్లర్లతో సంబంధాలు కలిగి ఉంటారు. అడవి దాటిన చందనం దుంగల డంప్‌లు నిర్వహించడం, అనువైన సమయంలో వాటిని స్టేజ్‌-1 స్మగ్లర్లకు చేరవేయడంలో వీరిది కీలకపాత్ర. 2013-14 సంవత్సరంలో తమిళనాడుకు చెందిన 9 మంది స్టేజ్‌-2 స్మగ్లర్లను అరెస్టు చేశారు. వీరిలో పేరు మోసిన వారు..
పేట సుబ్రమణ్యం దైవశిఖామణి
ఇతనిది తిరువళ్లూరు జిల్లా తిరుత్తణి. మేసీ్త్రల నుంచి సరుకు కొనుగోలు చేసి గోడౌన్లలో భద్రపరిచి, ఒకే సారి కొన్ని లోడ్ల సరుకును చెన్నైలోని ప్రధాన స్మగ్లర్లకు అందజేస్తాడు. ఇతనికి ప్రధాన స్మగ్లర్లు భాయ్‌, సెంథిల్‌తో సంబంధాలున్నాయి. ఇతనిని 2013 డిసెంబర్‌ 20న అరెస్టు చేశారు.
పి.ఎస్‌. నిత్యానందం అలియాస్‌ నిత్య
ఇతనిదీ తిరుత్తణే. మేసీ్త్రల నుంచి ఎర్రచందనం కొనుగోలు చేసి చెన్నైలోని ప్రధాన స్మగ్లర్లకు విక్రయిస్తాడు. టన్నుల కొద్ది ఎర్రచందనాన్ని నిల్వ చేసుకోవడానికి అనువుగా సొంత గోడౌన్లే నిర్మించుకున్నాడు. ఇతనిని 2014 జనవరి 10న అరెస్టు చేశారు.
వెంకటేశన్‌ వినోద్‌కుమార్‌
ఇతని స్వస్థలం వేలూరు. చిత్తూరు జిల్లాలోని ఫారెస్ట్‌ ఆఫీసర్లతో పరిచయం పెంచుకొని స్మగ్లింగ్‌ను సులభతరం చేసుకున్నాడు. ఇతను మేసీ్త్రల నుంచి ఎర్రచందనం కొనుగోలు చేసి చెన్నైలోని ప్రధాన స్మగ్లర్లకు అందజేస్తాడు. ఫారెస్ట్‌ అధికారుల పరిచయాలతో స్మగ్లింగ్‌లో ప్రత్యక్షంగా పాల్గొనే మేసీ్త్రలకు అటవీ అధికారుల కదలికపై రహస్య సమాచారాన్ని అందజేస్తాడు.
స్టేజ్‌-1 స్మగ్లర్లు
వీరు రోజుకు కనీసం ఒకటి నుంచి రెండు లారీల ఎర్రచందనాన్ని చిన్న స్థాయి స్మగ్లర్ల నుంచి కొనుగోలు చేసి ఒక చోట డంప్‌ చేస్తారు. పెద్ద మొత్తంలో పోగయ్యాక ఒక షిప్పుకు సరిపడే సరుకును చెన్నైలోని ప్రధాన స్మగ్లర్లకు అందజేస్తారు.
2013-14 సంవత్సరంలో పది మంది స్టేజ్‌ 1 స్మగ్లర్లను అరెస్టు చేశారు. సరుకు కొనుగోళ్ల కోసం వీరు జిల్లాకు వచ్చినప్పుడు కాపుకాసి ఆధారాలతో అరెస్టు చేశారు.
కొండిరి గిరిబాబు నాయుడు
తిరువళ్లూరు జిల్లాలోని తిరుత్తణి ఇతని స్వస్థలం. జేసీబీ స్పేర్‌ పార్టుల దుకాణం నిర్వహిస్తున్నాడు. మేసీ్త్రల నుంచి ఎర్రచందనం కొనుగోలు చేసి చెన్నైలోని ప్రధాన స్మగ్లర్లకు విక్రయిస్తాడు. స్మగ్లర్లకు ముందుస్తు పెట్టుబడులు సమకూరుస్తాడు. ఇతనిని 26-9-2013న అరెస్ట్‌ చేశారు.
రామకృష్ణ సెల్వం
సెంట్రల్‌ కస్టమ్స్‌ అండ్‌ ఎక్సైజ్‌ డిపార్టుమెంట్‌లో పనిచేసే సెల్వం ఏకంగా స్మగ్లింగ్‌లో దిగేశాడు. చెన్నైలోని కొల్లత్తూరు ఇతని నివాసం. ఎర్రచందనాన్ని షిఫ్పుల ద్వారా దేశ సరిహద్దులను దాటించడంలో ఈయన స్మగ్లర్లకు సహకరించేవాడు. 2013 డిసెంబర్‌ 1న ఇతనిని అరెస్ట్‌ చేశారు.
కొండ్రి నాగభూషణం మోహన్‌
తిరువళ్లూరు జిల్లా తిరుత్తణి ఈయన ఊరు. చిత్తూరు, తిరుపతికి చెందిన ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి దుంగలు కొనుగోలు చేసి నేరుగా చెన్నైలోని స్మగ్లర్లకు అందజేస్తాడు. ఇతన్ని 2013 డిసెంబర్‌ 6న అరెస్ట్‌ చేశారు.

No comments:

Post a Comment