Monday, 20 April 2015

దేశరాజు శ్రీనివాస్ - April 9 at 5:50pm

దేశరాజు శ్రీనివాస్ added 2 new photos.
April 9 at 5:50pm

శేషాచలం ఎన్ కౌంటర్ పై స్పందిస్తున్నమానవతామూర్తులకు వందనాలు. రెండు మూడు రోజులుగా ఈ మానవత్వం ఏరులై పారుతూ ఆన్ లైన్ లో పొంగి ప్రవహిస్తున్నందుకు నా మనసు ఉప్పొంగిపోయింది. ప్రపంచంలో ఇంకా ఇంత మానవత్వం వున్నదని మనసు నిండిపోయింది. గర్వంగా కూడా అనిపించింది.

సరే. ఇది అనాగరికం. కౄరం. ఈ పదాలు సరిపోవు కూడా. నిఘంటువులు వెతకండి. కొత్త మాటలు విసరండి. రాజ్యం మీద, రాజ్యాధికారం మీద దుమ్మెత్తిపోయండి. ఇక్కడే నాకో చిన్న సందేహాన్ని కూడా తీర్చండి. అజ్ఞానంతో అడుగుతున్నందుకు పెద్దమనసు చేసుకుని క్షమించండి. ఓకే. ఇది అనాగరికమైతే పదేళ్లు యథేచ్ఛగా సాగించిన దోపిడీ నాగరికమా? కూలీ పేరుతో ఇక్కడికొచ్చి ఖూనీ చేయడం మానవత్వమా.? వీళ్లు ఎంతమంది అధికారులను పొట్టన పెట్టుకోలేదు? రుజువులు కావాలా? మనమంతా పత్రికలు చదివేవాళ్లమే కదా.

యుద్ధంలో అటోఇటో మరణాలు నిశ్చయం. చేసేది ధర్మయుద్ధమా కాదా అన్నదే సంశయం. కాల్పులు ధర్మం కాదని తేల్చిన ధర్మమూర్తులు వేలకోట్ల రూపాయిల జాతిసంపదని చీకటిచాటున దోచుకోవడం ధర్మమేనని సమర్దిస్తున్నారా?

ఊచకోత ఏనాటికీ ఉచ్ఛం కాదు, నిస్సంకోచంగా నీచమే. మరి తప్పు చేసిన వాడికి కోర్టు కూడా ఉరి వేస్తుందే. కోర్టుని కూడా తప్పుబడదామా? నిజమే. మనం మనుషులమే, అంతమాత్రాన మనమే చేసుకున్న శాసనాలకు, మనమే రూపొందించుకున్న చట్టాలకు అతీతులమని అనుకుందామా? అడవుల్లో తెగబడి దొరికిందంతా దోచుకుని వీరప్పన్ వారసులు విశృంఖలంగా చెలరేగిపోతూ వుంటే వారిని దళితులని, మైనారిటీ, మరొకటి అని సరిపెట్టుకుందామా?

ఒక్క మాట చెప్పండి, ఒక అభాగ్యుణ్ణి మీ ఇళ్లకి పంపి దొరికింది దోచుకురమ్మని, అడ్డొస్తే రాళ్లేసి చంపమని చెప్పి పంపిస్తే అడ్డుకోరా? ఆకలితో వచ్చాడని అన్నం పెట్టి పంపిస్తారా?
కులాలు, అంతరాలు బట్టి నేరం అంగీకరించే పరిస్థితి వుండదు. వేల కోట్లు దోచుకున్న జగత్ కిలాడీలైనా, వంద రూపాయిల కూలీకి వచ్చి ఖూని చేసేవాడైనా నేరం నేరమే. శిక్ష అర్హమే.

వాళ్ళు నేరం చేయలేదని ఎవరూ అనలేదు. న్యాయప్రక్రియ సాగాలన్నదే డిమాండు!


దేశరాజు శ్రీనివాస్ గారూ! న్యాయవ్యవస్థ మీద మీకున్న అపార అవగాహనకు అబ్బుర పడుతున్నాను. నేరం చేసిన వాళ్లను (అది ఎంతపెద్ద నేరమైనాసరే)   పోలీసులే చంపవచ్చని భారత శిక్షా స్మృతిలోని ఏ అధ్యాయంలో ఏ సెక్షను కింద వుందో  తమరు సెలవిస్తే మేము నేర్చుకుంటాము. చట్టంలో లేకున్నా మీ ప్రభుత్వ పెద్దలు అలాంటి ఉత్తర్వులు ఇచ్చివున్నా, Communication Officer గా ఆ వివరాలు తెలిపినా ఆనందిస్తాము.

ఎన్ కౌంటర్ జరగ్గానే సదరు పోలీసుల మీద హత్యానేరం కింద కేసు బుక్ చేయాలని చట్టం చెపుతున్నట్టు తమకు తెలిసినట్టులేదు. శేషాచలం  ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న  పోలీసులపై కిడ్నాప్, హత్య సెక్షన్ల కింద సకాలంలో కేసు నమోదు చేయనందుకు  రాష్ట్ర అడ్వకేట్ జనరల్ ను హైకోర్టు మందలించినట్టు మీకు తెలుసా?  కోర్టు ఆదేశాలమేరకు 24 మంది పోలీసుల మీద కేసులు నమోదైనట్టు మీకు తెలుసా? CMO లో కూర్చొని కోర్టు ధిక్కార భాష మాట్లడడం ఇప్పుడు మీరు చేస్తున్న కొలువుకు తగదు.

ఇంతటి Communication Gapతో తమరు  Communication Officers  విధుల్ని ఎలా నిర్వర్తిస్తున్నారో అర్ధం కాదు. దళితులు,  మైనారిటీలు వంటి బలహీన సామాజికవర్గాల గురించి మీరు  "విశృంఖలంగా చెలరేగిపోతు"న్నారు (ఈ పద ప్రయోగం మీదే). అప్పుడు మీ కంప్యూటర్ ను విడదీసి మదర్ బోర్డును విశ్లేషించాల్సి వుంటుంది.

No comments:

Post a Comment