Tuesday 19 May 2015

అధికారుల సహకారంతోనే ఎర్రచందనం కొనుగోలు చేశా

కడప: అధికారుల సహకారంతోనే ఎర్రచందనం కొనుగోలు చేశా- స్మగ్లర్‌ ముఖేష్‌ బదానియా

కడప, మే 19 : కొందరు అధికారుల సహకారంతోనే ఎర్రచందనం కొనుగోలు చేశానని హర్యానాకు చెందిన స్మగ్లర్‌ ముఖేష్‌ బదానియా సంచలన వ్యాఖ్యలు చేశారు.మంగళవారం ముఖేష్‌ బదానియా ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ప్రతినిధికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. రాయలసీమ ప్రాంతానికి చెందిన కొందరు ఎర్రచందనం కొనుగోలుకు మధ్యవర్తులుగా వ్యవహరించారని, తన వద్ద కమీషన్‌లు తీసుకొని సహకరించారని పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాలోని అటవీ ప్రాంతంలో భారీగా ఎర్రచందనం కొనుగోలు చేశానని, వాటిని ముక్కలుగా కట్‌ చేసి అమ్మేవాడినన్నారు. ఎర్రచందనం స్మగ్లర్‌ గంగిరెడ్డి మీకు తెలుసా అన్న ప్రశ్నకు ముఖేష్‌ బదానియా నవ్వి ఊరుకున్నాడు. ఎమ్మెల్యేలు, స్మగ్లర్‌లతో సంబంధాలపై మాట్లాడేందుకు ముఖేష్‌ బదానియా నిరాకరించారు. తాను ప్రభుత్వం వద్ద అధికారికంగానే ఎర్రచందనాన్ని కొనుగోలు చేశానని చెప్పారు. కాగా ఎర్రచందనం దుంగలు అక్రమంగా కొనుగోలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ కొనుగోలుకు చిత్తూరు జిల్లాకు చెందిన కొందరు స్థానిక నేతలు, అటవీశాఖ ఉద్యోగులు సహకరించారని ఆయన ఆరోపించారు. అధికారులు, నాయకులు తన వెనుక ఉన్నారని ముఖేష్‌ బదానియా వ్యాఖ్యానించారు. తానిచ్చే కమీషన్ల కోసం అధికారులు కక్కుర్తి పడ్డారని ఆయన చెప్పారు. జిల్లా నాయకుల సహకారం లేకుండా తానెలా ఎర్రచందనాన్ని స్మగ్లింగ్‌ చేస్తానని ముఖేష్‌ బదానియా ప్రశ్నించారు. చిత్తూరు జిల్లా ఎర్రచందనం స్మగ్లింగ్‌కు అడ్డా అని ఆయన వ్యాఖ్యానించారు.

No comments:

Post a Comment