Saturday 9 May 2015

చిత్తూరు పోలీసుల ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో చైనా స్మగ్లర్‌ అరెస్టు

చిత్తూరు పోలీసుల ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో చైనా స్మగ్లర్‌ అరెస్టు

తిరుపతి, చిత్తూరు టౌన్‌/కాకినాడ క్రైం, మే 8(ఆంధ్రజ్యోతి): చిత్తూరు పోలీసులు విదేశీ స్మగ్లర్లపైనా ఉక్కుపాదం మోపుతున్నారు. చైనా దేశానికి చెందిన స్మగ్లర్‌ను గురువారం తెల్లవారుజామున అరెస్టు చేశారు. ఎర్ర చందనం స్మగ్లింగ్‌లో ఒక విదేశీ స్మగ్లర్‌ను అరెస్టు చేయడం ఇదే తొలిసారి. చిత్తూరు స్పెషల్‌ పార్టీ పోలీసులకు అందిన సమాచారం మేరకు హైదరాబాద్‌లో స్మగ్లర్లపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో చైనా స్మగ్లర్‌ యాంగ్‌ పాంగ్‌తోపాటు కడప జిల్లా రాయచోటికి చెందిన శ్రీనివాసరాజును అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు పరారయ్యారు. వారి నుంచి 30 కిలోల రెండు దుంగలు, చైనా కరెన్సీ, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. పరారైన వారిలో ఎర్రావారిపాళ్యంకు చెందిన చంద్రశేఖర్‌రెడ్డి, కె.చంద్రశేఖర్‌, హైదరాబాద్‌కు చెందిన కిషోర్‌ కుమార్‌రెడ్డి ఉన్నట్లు సమాచారం. కాగా, శ్రీనివాసరాజు ఇచ్చిన సమాచారం మేరకు హైదరాబాద్‌లో తనిఖీలు ముమ్మరం చేశారు. ఎన్‌కౌంటర్‌ జరిగినా ఎర్రచందనం స్మగ్లింగ్‌ ఆగలేదని డీజీపీ జేవీ రాముడు వ్యాఖ్యానించారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఆయన మాట్లాడుతూ స్మగ్లింగ్‌ను అడ్డుకునే క్రమంలో ఇప్పటివరకు 4500 మందిని అరెస్టు చేశామన్నారు.

No comments:

Post a Comment